సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రెండు ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ప్లాన్!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2024-05-27 01:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా, ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గుచూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ, మున్సిపాలిటీలకు వెంటవెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

స్పెషల్ ఆఫీసర్ల పాలన

వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలను వెంటవెంటనే నిర్వహించేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచేందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నది.

ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేసినట్టు తెలిసింది. అప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది. ‘జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం ముగియగానే వాటికి సైతం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తాం. మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియగానే అక్కడ సైతం ప్రత్యేక అధికారులను నియమిస్తాం.’ అని సీఎంఓలోని ఓ అధికారి వెల్లడించారు.

కొత్త బీసీ కమిషన్‌తోనే కులగణన!

ప్రస్తుతం బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టులో ముగియనున్నది. ఆ వెంటనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసి, బీసీ కులగణన చేయాలని ప్రభుత్వం కోరనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి కులగణన చేసి, రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని ఇటీవల సీఎం నిర్వహించిన రివ్యూలో అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. బీసీ కులగణన పూర్తయిన తర్వాత జనాభా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్పెషల్‌గా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చట్టాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.

కొత్త ఎన్నికల కమిషనర్ కోసం సెర్చింగ్

స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనున్నది. దీంతో ఆ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, పలువురు పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తారనే పేరున్న తెలుగు ఐఏఎస్ ఆఫీసర్లను ఎంపిక చేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

30 రోజుల్లోనే కంప్లీట్?

సర్పంచ్ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి, మున్సిపల్ ఎన్నికలు ఇంకోసారి నిర్వహించడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీని వల్ల పాలనపై కాకుండా రాజకీయాలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సైతం బ్రేకులు పడుతాయి. అందుకే 30 రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకదాని తర్వాత మరొకటి వెంటవెంటనే నిర్వహించేందుకు సీఎం రేవంత్ మొగ్గుచూపుతున్నట్టు సీఎంఓ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.

మెగా గ్రేటర్ ఏర్పాటు

జీహెచ్ఎంసీ, గ్రేటర్ చుట్టూ ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీల పదవీ కాలం మరికొన్ని నెలలు ఉండటంతో వాటికి విడిగా ఎన్నికలు నిర్వహంచనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఏరియా కలిపి మెగా గ్రేటర్ హైదరాబాద్ సంస్థను ఏర్పాటుచేసి, అందులో విలీనం చేసిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.

Similar News