ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి!.. హిస్టరీ షీట్స్ తెరుస్తామని సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్ పరిధిలో బైకులపై వచ్చిన కొందరు దుండగులు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారని, పోలీస్ వారి సహకారంతో వారిపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

Update: 2024-05-16 07:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిధిలో బైకులపై వచ్చిన కొందరు దుండగులు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారని, పోలీస్ వారి సహకారంతో వారిపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. బస్సుపై దాడికి సంబందించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన ఘటనపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారని, ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయని, అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని. ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలేనని పేర్కొన్నారు. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదని, పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని, బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేయడం జరుగుతుందని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Similar News