యూనివర్సిటీ వీసీల నియామకంలో పారదర్శకత పాటించాలి: ఏబీవీపీ

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీ‌లలో కొత్తగా నియమించే వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకంలో పారదర్శకత పాటించాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వీ తేజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-05-18 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీ‌లలో కొత్తగా నియమించే వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకంలో పారదర్శకత పాటించాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వీ తేజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీసీల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే విసీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను వీసీలుగా నియమించాలని కోరారు . సామాజిక వర్గం, డబ్బు ప్రాతిపదికన నియామకం చేపట్టొద్దన్నారు. గతంలో అవినీతిలో కూరుకుపోయి లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన వీసీలు, రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించిన వీసీలను చూశామన్నారు. ఇప్పుడు తిరిగి అలాంటి వాటికి తావు లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని వీసీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తి మరియు ప్రతిష్టను కాపాడే వారినే నియమించాలని డిమాండ్ చేశారు.10 ఏళ్ళు నిధులు, నియామకాలు లేక యూనివర్సిటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వమైన అక్రమార్కులకు , రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వచ్చే వారిని కాకుండా నీతి నిజాయితీతో పని చేసే వారిని ఎంపిక చేయాలని పృథ్వి తేజ డిమాండ్ చేశారు.

Similar News