మాజీ మంత్రి మల్లారెడ్డిపై చర్యలు అందుకేనా!

చెరువులో అక్రమ నిర్మాణాలు చేశారని, ప్రహారీ గోడను కూల్చివేయడంతో మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.

Update: 2024-05-24 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చెరువులో అక్రమ నిర్మాణాలు చేశారని, ప్రహారీ గోడను కూల్చివేయడంతో మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. షామీర్ పేట మండలం బొమ్మరాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. చెరువులో అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడలను అధికారులు దగ్గరుండి జేసీబీల సహాయంతో కూల్చివేశారు.

కాగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డికి కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వరుస షాకులు తగులుతున్నాయి. భూకబ్జాలు, ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేశారని ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకొని ఉన్న మల్లారెడ్డిపై పెద్ద చెరువుని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని మరో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఇటీవలే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సుచిత్ర ప్రాంతంలోని తమకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నరాని చేసిన ఆరోపణల నేపధ్యంలో వారిపై కేసు నమోదు అయ్యింది.

ఈ కేసు విషయంలో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మాజీ మంత్రిగా ఉన్న ఆయనపై ఈ వరుస ఘటనలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉండగా కాంగ్రెస్ నాయకులపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ చర్యలు జరుగుతున్నాయా? లేక మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని తగ్గించేందుకే ఈ అక్రమాలను వెలికి తీస్తున్నారా? అనేది రాజకీయ నిపుణుల చర్చలో భాగం అయ్యింది.

Similar News