‘పాలిసెట్’ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రూల్ మర్చిపోతే ఎగ్జామ్ హాల్‌లోకి ‘నో ఎంట్రీ’..!

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 3 సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా,

Update: 2024-05-22 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 3 సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ఈనెల 24న జరగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 92,808 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 56764 అప్లికేషన్లు రాగా అందులో బాలురు 34,012, బాలికలు 22,752 మంది దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మొత్తం 36,044 అప్లికేషన్లు రాగా బాలురు 17,606, బాలికలు 18,438 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులకనుగుణంగా మొత్తం 259 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌బీ‌టీఈటీ కార్యదర్శి వివరించారు. విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోరని స్పష్టంచేశారు. హాల్ టికెట్‌పై ఫోటో ప్రింట్ కాని అభ్యర్థులు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డ్‌ను తీసుకురావాలని సూచించారు. ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రాన్ని గుర్తించడానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. విద్యార్థులు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఎస్‌బీ‌టీఈటీ టీజీ’ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలన్నారు. పరీక్ష కేంద్రం లొకేషన్ కోసం పాలిసెట్ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ఆప్షన్ ను నొక్కాలని, అక్కడ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలని సూచించారు.

Similar News