తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేసుకోవచ్చు.. ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2వ తేదీన చేసుకోవచ్చని ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది.

Update: 2024-05-24 12:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2వ తేదీన చేసుకోవచ్చని ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (జూన్ 2) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏడు దఫాలుగా జరుగుతున్న లోకసభ పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దీంతో ఎన్నికల కోడ్‌కు ఇబ్బంది ఉండదని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఈ క్రమంలో తాజాగా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది.

ఈసీ అనుమతితో ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. జూన్ రెండో తేదీ ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఈసారి వినూత్నంగా వేడుకలు

ఈ సారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఆయన తన ఇంట్లో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇచ్చేలా వేడుకలను డిజైన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇవ్వడం వల్లే రాష్ట్రం ఏర్పాటైందన్న సందేశం చేరేలా వేడుకలు ఉంటాయని వివరించారు. కాగా, ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించనున్న ట్లు సమాచారం.

Tags:    

Similar News