ప్రచారంలో దూకుడు.. ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన స్కెచ్ ఇదే..!

రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండుతుండగా మరోవైపు పార్లమెంట్ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

Update: 2024-05-08 01:57 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండుతుండగా మరోవైపు పార్లమెంట్ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికలకు గడువు 5 రోజులు మిగిలి ఉండగా ప్రచార గడువు మరో మూడు రోజులలో ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నువ్వా, నేనా అనేలా ప్రజలలోకి వెళుతున్నారు. క్షేత్రస్థాయిలో రోడ్ షోలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలిపించి ఢిల్లీకి పంపితే పార్లమెంట్‌లో తమ గళం వినిపించి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. సంక్షేమపాలనతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు లోక్ సభ ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రాధేయపడుతుండగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి మరోమారు ఓటు వేసి హ్యాట్రిక్ అధికారాన్ని కట్టబెట్టాలని బీజేపీ ప్రజా క్షేత్రంలోకి వెళ్తోంది. ప్రగతి పాలనను కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు ఓటర్లను కోరుతున్నారు.

ప్రచారంలో జాతీయ నాయకులు..

హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు గ్రేటర్ పరిధిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి తమ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇక ఎంఐఎం, బీఆర్ఎస్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తిగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ప్రచారంపైనే ఆధారపడ్డారు. ఇంటింటికి ప్రచారం చేస్తున్నా తమ పార్టీ అగ్రనేతలతో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంఐఎం పూర్తిగా పార్టీ అధినేత అసదుద్ధీన్, ఎమ్మెల్యే అక్బరుద్ధీన్‌లపైనే ఆధారపడింది. మొత్తం మీద పోలింగ్ గడువు సమీపిస్తుండగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచి ముందుకు సాగుతున్నాయి.

ఎలాగైనా గెలవాలి..?

‌సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని గత రెండు పర్యాయాలుగా వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ పర్యాయం కూడా గెలుపు కోసం బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరాటపడుతుండగా ఎలాగైనా రాబోయే ఎన్నికలలో కమలం పార్టీ నుంచి లష్కర్‌ను లాగేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సుమారు 40 ఏండ్లుగా ఎంఐఎం ఏకచత్రాధిపత్యంగా గెలుస్తూ వస్తోంది. ఈ ఎన్నికలలో ఎంఐఎంకు చెక్ పెట్టాలని బీజేపీ, బీఆర్ఎస్‌లు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత హిందూ ఓటర్లతో పాటు మైనార్టీ ఓటర్లపై కూడా దృష్టిపెట్టారు. పార్టీలకు అతీతంగా పాతబస్తీని అభివృద్ధి చేస్తామని ఓట్లడుగుతుండడంతో మైనార్టీలు కూడా ఆమె పట్ల ఆసక్తి చూపుతునట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పర్యాయం ఈ నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని ఓట్లు పోలవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

Similar News