బినామీలకే టెండర్లు..!

మహా నగరంలో వానాకాలం కష్టాల నివారణకు కేటాయించిన నిధులను పనుల పేరిట తమ జేబులు నింపుకునేందుకు కొందరు ఇంజినీర్లు స్కెచ్ వేస్తున్నారు....

Update: 2024-05-25 02:33 GMT
  • ఎమర్జెన్సీ టీముల టెండర్లలో ఇష్టారాజ్యం
  • సగం సర్కిళ్లలో బంధువులు, బినామీలు
  • కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
  • వాన కష్టాల నివారణకు యాక్షన్ ప్లాన్
  • రూ.50 కోట్లతో సహాయక చర్యలు
  • 6 జోన్లలో 385 స్టాటిక్ లేబర్ టీములు, 191 వాహనాలు
  • ప్రతి సర్కిల్‌కి రెండు రకాల బృందాలు

దిశ, సిటీ బ్యూరో: మహా నగరంలో వానాకాలం కష్టాల నివారణకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రూ.50 కోట్ల వ్యయంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. కానీ ఆ నిధులను పనుల పేరిట తమ జేబులు నింపుకునేందుకు అక్రమార్కులైన కొందరు ఇంజినీర్లు స్కెచ్ వేస్తున్నారు. ఆ పనులను ఎలాగైనా తమ బంధువులు, బినామీలకు కేటాయించేందుకు టెండర్స్ నిబంధనలను సైతం ఉల్లంఘించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వర్షం కురుస్తున్నపుడు, కురిసిన తర్వాత వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్ద నీటిని తోడేసేందుకు గాను రెండు రకాలుగా ఈ టీములను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ సారి భారీ వర్షాలు కాస్త ముందుగానే కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కాస్త ముందుగానే ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసే పనిలో ఉంది. సర్కిళ్ల వారీగా టెండర్ల ప్రక్రియను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రూ.50 కోట్లతో మ్యాన్ పవర్, మిషనరీ, పని ముట్లు వంటివి సమకూర్చనున్నారు. మొత్తం 385 టీములను 30 సర్కిళ్లకు కేటాయించనున్నారు. ఈ టీముల్లో స్టాటిక్ లేబర్ టీములు, వాహనాలు, వాహనాలతో అన్ని రకాల పనిముట్లున్న బృందాలు (మొబైల్ మాన్సూన్ టీమ్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాలు రౌండ్ ది క్లాక్ మూడు షిఫ్టుల్లో పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను సర్కిళ్ల వారీగా నిధులను కేటాయించారు. అన్నింటి కన్నా ఎక్కువ బృందాలను కోర్ సిటీలో వీఐపీలు, వీవీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్ జోన్‌కు 105 స్టాటిక్ లేబర్ టీమ్‌లు, అలాగే మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు 28తో పాటు 29వాహనాలతో దాదాపు రూ.9.76 కోట్లను కేటాయించారు. అన్ని జోన్ల కన్నా తక్కువ టీములు, నిధులను కూకట్‌పల్లి జోన్‌కు కేటాయించారు. ఈ జోన్‌కు 9 స్టాటిక్ లేబర్ టీమలు, మరో 5 మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు, 5 వాహనాలతో రూ. 6.66 కోట్ల నిధులు కేటాయించారు. శేరిలింగంపల్లి జోన్‌లోని నాలుగు సర్కిళ్లకు కలిపి సుమారు రూ.10 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ టీములన్నీ రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటాయని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇన్‌స్టెంట్ రీపేర్ టీమ్ (ఐఆర్టీ) బృందాలనే ఇపుడు ఎమర్జెన్సీ బృందాలుగా మార్చనున్నట్లు సమాచారం.

అమాయక కూలీలే వారి టార్గెట్

ప్రతి వర్షాకాలం రౌండ్ ది క్లాక్ సహాయక చర్యల కోసం ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశామని ప్రకటించే అధికారులు ఈ నిధులను తమ జేబుల్లో నింపుకునేందుకు వీలుగా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు అడ్డా కూలీలనే టార్గెట్ చేస్తూ, వారికి రోజుకి రూ. వెయ్యి కూలీగా చెల్లిస్తున్నట్లు బిల్లులు క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై సహాయక చర్యల పేరిట అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కనీసం వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్ద మోటార్లతో నీళ్లు ఎలా తోడేయ్యాలన్న అంశంపై కనీస అవగాహన లేని కూలీలతో ఈ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వారికి రోజుకి రూ. వెయ్యి కూలీగా ఇస్తామని చెబుతూ వర్షం పడి, పని ఉన్న రోజున రోజుకి రూ. 600, వర్షం పడని రోజున రూ. 300 చెల్లించి, వారి శ్రమను సైతం దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సర్కిళ్లలో డ్రాయింగ్ ఆఫీసర్లుగా వ్యవహారిస్తున్న డిప్యూటీ కమిషనర్లు, ఆ తర్వాత మేజర్ వాటాను ఇంజనీర్లు దండుకుంటున్నట్లు వాదనల్లేకపోలేవు.

బినామీలు, బంధువులకే పనుల కేటాయింపు

సర్కిళ్ల వారీగా టెండర్ల చేపట్టిన ఇంజినీర్లు పనులను తమ బినామీలు, బంధువులకే కేటాయించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి, పాతబస్తీ, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో పలువురు ఇంజినీర్లు కొంతకాలంగా తమ బినామీలకు ఈ ఎమర్జెన్సీ బృందాల పనులను కట్టబెడుతూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ లైసెన్స్ కల్గి నిజాయితీగా పని చేస్తున్న కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కకపోవటం ఇందుకు నిదర్శనం. ఇంజినీర్లతో కుమ్మకైన ఏజెన్సీలు కాకుండా ఇతర కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటే లేనిపోని కొర్రీలు పెట్టి, వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో దాదాపు 20 సర్కిళ్లలో ఇంజనీర్లు తమ బినామీలకు, లేక తమ బావమరుదులకు, తమ్ముళ్లకు ఈ పనులను కేటాయించి, టెండర్లలో పేర్కొన్న సంఖ్య కన్నా తక్కువ సంఖ్యలో టీమ్‌లను ఏర్పాటు చేసి, మొత్తం బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Similar News