పూర్తి ఆధారాలతో లేఖ విడుదల చేస్తా.. మరో బాంబ్ పేల్చిన MLA మహేశ్వర్ రెడ్డి

సివిల్ సప్లయ్ శాఖలో కమీషన్లకు మంత్రి ఉత్తమ్ అగ్రిమెంట్ రాసుకున్నాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

Update: 2024-05-24 16:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్ సప్లయ్ శాఖలో కమీషన్లకు మంత్రి ఉత్తమ్ అగ్రిమెంట్ రాసుకున్నాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై పూర్తి ఆధారాలతో సీఎంకు బహిరంగ లేఖ విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు. ఆ శాఖలో రూ.1150 కోట్ల గోల్ మాల్ జరిగిందని, ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రికి రాసే బహిరంగ లేఖలో ప్రస్తావిస్తానని చెప్పారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వం అవినీతి, అక్రమాలను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెడతారా అని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పాటిల్, పాల్వయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న ప్రజాపాలన ఇదేనా అంటూ నిలదీశారు. ఆధారాలతో రాష్ట్ర సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడితే సమాధానం చెప్పాల్సిన సంబంధింత శాఖ మంత్రి ముఖం చాటేశారని విరుచుకుపడ్డారు.

అధికారులతో సమాధానం చెప్పించి దాటవేసే ప్రయత్నం చేశారని చురకలంటించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కార్యకర్తలతో కేసులు పెట్టించడం అరాచకమని వారు పేర్కొన్నారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదంటే.. సమాధానం చెప్పాలన్నారు. కేసులకు, చట్టపరమైన చర్యలకు బీజేపీ నాయకులు ఎప్పుడూ భయపడరన్నారు. ప్రజా సమస్యల కోసమైనా, అక్రమాలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామన్నారు. ఎన్ని జైళ్లకైనా వెళ్తామన్నారు. మహేశ్వర్ రెడ్డిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనంటే, అవినీతి, అక్రమాలు, దోచుకోవడం, దాచుకోవడమేనా అని విమర్శలు చేశారు.

Similar News