చేనేత వస్త్రాలంటూ దళారుల విక్రయం.. విచారణకు మంత్రి తుమ్మల ఆదేశం

టెస్కో నిధుల నుండి కొంతమంది మధ్య దళారులు పవర్ లూమ్ వస్త్రములను చేనేత వస్త్రములుగా విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.

Update: 2024-05-25 16:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టెస్కో నిధుల నుండి కొంతమంది మధ్య దళారులు పవర్ లూమ్ వస్త్రములను చేనేత వస్త్రములుగా విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేటి వరకు 33.23 కోట్ల రూపాయల నిధులను నేత కార్మికులకు 10% యార్న్ సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుండి విడుదల చేశామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధి చేకూరే పథకాల కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం 2018లో పవర్ లూమ్ కార్మికులకు ఇన్‌పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనాల పరిహార పథకం 10% యార్న్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టి, క్యాబినెట్ ఆమోదం లేకపోవడంతో నేటి వరకు నిధులు విడుదల కాని విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని కేబినెట్ ఆమోదం లేకుండా హడావిడిగా ప్రవేశపెట్టడం ద్వారా ఆ పథకానికి కూడా నిధుల విడుదల కాలేదని, ఆర్భాట ప్రచారాల కోసం పథకాలు ప్రవేశపెట్టి చేనేత కార్మికులను మోసం చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతి ప్రకారం.. అసలైన చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామన్నారు.

మరమగ్గాల, చేనేత మగ్గాల ఆధునీకరణకు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా నేతన్నలకు సహాయం కింద 2024-25 సంవత్సరానికి బీసీ వెల్ఫేర్ శాఖకు కేటాయించబడిన 400 కోట్ల బడ్జెట్ వినియోగించుటకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖల ద్వారా 255 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు టెస్కో‌కు వస్త్ర సరఫరా కోసం రావడం జరిగిందన్నారు. వస్త్ర సరఫరాకు ఆర్డర్స్ వల్ల చేనేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందన్నారు. నేత, చేనేత కార్మికులు, మరమగ్గ కార్మికులు స్వయం సమృద్ధి సాధించుట కొరకు దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరే పథకాల రూపకల్పన కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టదని కేవలం చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధి కోసమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. తమ రాజకీయ పబ్బం కోసం వివిధ రాజకీయ పార్టీలు వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ చేనేత కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని లేకపోతే ప్రజా జీవితంలో వారికి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.

Similar News