తెలంగాణ సమాజం తలదించుకునేలా రేవంత్ రెడ్డి తీరు.. బీజేపీ లక్ష్మణ్ విమర్శలు

ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎటాక్ చేస్తోంది.

Update: 2024-05-01 07:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:నెహ్రు నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని అవమానించారని ఈ చరిత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకుని మాట్లాడితే మంచిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాను దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారిపోయారని ధ్వజమెత్తారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మడం లేదని దీంతో ఏకంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం చూసి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫేక్ వీడియోల వ్యవహారంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియోలు రూపొందించడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా లేక చైనా కమ్యూనిస్టులు ఉన్నారా తేలాల్సి ఉందన్నారు. అబద్దపు విష ప్రచారాన్ని నమ్ముకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని అదే రీతిలో ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు లేవని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీనే ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా రిజర్వేషన్లు ముస్లింలకు దారాదత్తం చేసిందన్నారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారని, రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చూస్తామని మోడీ, అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేది లేదని బీజేపీ అగ్రనేతలే చెప్పారన్నారు. బీజేపీపై కాగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు.

Tags:    

Similar News