అమ్మ ను మోసం చేసిన కూతురు

ఎన్నో ఏండ్ల కాలం నుంచి ఉన్న రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి నాటి ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది.

Update: 2024-05-25 11:05 GMT

దిశ, ప్రతినిధి వికారాబాద్ : ఎన్నో ఏండ్ల కాలం నుంచి ఉన్న రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి నాటి ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ వచ్చాక ఒక రకంగా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరికినప్పటికీ, ఈ పోర్టల్ కారణంగా ఎప్పుడు లేని కొత్త సమస్యలు రోజుకు ఒకటి ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న భూములు సైతం లోలోపల రిజిస్ట్రేషన్లు అవుతుంటే రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, తహసీల్దార్ కార్యాలయాల

    చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయండి సారు అంటూ ప్రాథేయ పడుతున్న పరిస్థితి ఉంది. ధరణిలో స్లాట్ బుక్ అయితే చాలు రిజిస్ట్రేషన్ ఆపడం మా చేతుల్లో లేదు అంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్తేస్తున్న పరిస్థితి. దాంతో ఏం చేయాలో తెలియక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ధరణి సమస్యలు అనేకం ఉన్నాయి. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ధరణి పోర్టల్ కారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి భూమి బదలాయింపు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన గురించి తెలిసి సామాన్య ప్రజలే కాకుండా న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

బ్లాక్ లో ఉన్న సర్వే నెంబర్లు ఆన్ బ్లాక్ ఎలా అయ్యాయి..?

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం, బషీరాబాద్ మండలం, దామరచేడు గ్రామానికి చెందిన ఆశన్పల్లి మణెమ్మ భర్త బలప్పకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలం మణెమ్మ పేరు పైన పాసుబుక్ వచ్చింది. ఈ 10 ఎకరాల పొలంలో నుంచి ముగ్గురు కూతుళ్లకు సమాన వాటా పంచి, మిగిలిన భూమిని తన పేరున చేసుకుందామని మణెమ్మ అనుకుంది. అంతలోనే ఆమె రెండో కూతురు జోగి అమృత తన భర్త జోగి బాల్ రాజ్ లు తల్లిని మోసం చేసి ఎలాగైనా భూమి మొత్తం కొట్టేయాలి అని తప్పుడు ఆలోచన చేశారు. అప్పుడు ధరణి పోర్టల్ లేదు. బ్యాంకులో రూ.3 లక్షల లోన్ కావాలని, నువ్వు షూరిటీ సంతకం చేయాలని అత్తను నమ్మించిన బాలరాజు తాండూర్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి అత్త పేరు మీద ఉన్న సర్వే నెంబర్ 100/అ/1 లో 2 ఎకరాల 19 గుంటలు, 100/అ/2 లో 1 ఎకరా 1 గుంట

    మరో సర్వేనెంబర్ 94/ఈ/1, 94/ఈ/2 లో 4 ఎకరాలు మొత్తంగా 7:20 ఎకరాల భూమిని తప్పుడు పద్ధతిలో తన భార్యతో పాటు తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితురాలు మణెమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎన్ని రోజులైనా ఈ విషయం బయటపడలేదు. ధరణి పోర్టల్ వచ్చాక అసలు నిజం తెలుసుకున్న బాధితురాలు ఆమె మరో ఇద్దరు కూతుర్లు అయిన లక్ష్మి, శృతికలు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాక, 2020లో తాండూరు కోర్టును ఆశ్రయించి మాకు న్యాయం చేయాలని కోరారు. దాంతో ఆ సర్వే నెంబర్ల పై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. తదుపరి తీర్పు అయ్యేవరకు అట్టి సర్వే నెంబర్లపై ఎలాంటి భూ బదలాయింపు జరగకూడదని ఆర్డర్ ఇవ్వడంతో అప్పటి రెవెన్యూ అధికారులు 10 ఏప్రిల్ 2023 నాడు ధరణి పోర్టల్ లో అట్టి సర్వే నెంబర్లను బ్లాక్ చేయడం జరిగింది. న్యాయం కోసం కోర్టులో విచారణ జరుగుతున్న

     సమయంలోనే ఈ ఏడాది 26 ఏప్రిల్ 2024 నాడు అట్టి సర్వే నెంబర్లు అన్ బ్లాక్ అవ్వడమే కాకుండా, ఈనెల 4వ తేదీన మరొకరి పేరు పైకి భూమి బదలాయింపు కూడా జరిగింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న బాధితులు బషీరాబాద్ ఎంఆర్ఓ ను ఆశ్రయించారు. ధరణి పోర్టల్ లో స్లాట్ బుక్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఎమ్మార్వో వెంకటేష్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక శుక్రవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ ను కలవాలని ప్రయత్నించగా, ఆ సమయంలో కలెక్టర్ లేకపోవడంతో వెను తిరిగి వెళ్లిపోయారు.

మాకు న్యాయం చేయండి సారు : బాధితురాలు ఆశన్పల్లి మణెమ్మ

నా రెండవ కూతురు అమృత, అల్లుడు బాలరాజ్ చేసిన మోసానికి 10 ఎకరాల పొలం ఉండి కూడా నేను అనాథలా రోడ్డున పడ్డాను. ముగ్గురు కూతుర్లకు సమాన వాటా పంచి నా దగ్గర కొంత భూమి పెట్టుకొని హాయిగా బతుకుదాం అనుకుంటే నన్ను నమ్మించి మోసం చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నిజం తెలుసుకొని కోర్టును ఆశ్రయించాను. కోర్టు కేసులో ఉండగా రెండోసారి కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇతర వ్యక్తులకు భూమి అమ్మడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించి నాకు న్యాయం చేయాలి. ఈ సమస్యను సోమవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా.

కోర్టును ధిక్కరించడం చట్ట విరుద్ధం : న్యాయవాది బి.రమేష్ కుమార్..

కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ధిక్కరించడం చట్ట విరుద్ధమని, తదుపరి న్యాయం కోసం బాధితురాలు మాణెమ్మ తరపున కోర్టులో పోరాటం చేస్తానని బాధితురాలు తరుపు న్యాయవాది రమేష్ కుమార్ తెలిపారు. 

Similar News