2,877 కేంద్రాల ద్వారా పోలింగ్​ .. చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలో 29,38,370 మంది ఓటర్లు

ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్​ ఎన్నికలకు రిటర్నింగ్​

Update: 2024-05-10 11:15 GMT

దిశ,రంగారెడ్డి బ్యూరో: ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్​ ఎన్నికలకు రిటర్నింగ్​ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ శశాంక్​ సర్వం సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ, పోలింగ్​ కేంద్రాలు, ఈవీఎం పరికరాల కమీషనింగ్​ వంటి పూర్తి ప్రక్రియను పూర్తి చేశారు. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు కలుపుకొని ఉన్న పార్లమెంట్​ చేవెళ్ల నియోజకవర్గం. ఈ చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్​, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్​, పరిగి, తాండూర్​ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కలిపి 29,38,370 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 15,04,260... మహిళలు 14,33,830... ఇతరులు 967 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు పూర్తిస్థాయిలో రిటర్నింగ్​ అధికారి ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలో 2877 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నట్లు తెలుస్తోంది.

పోలింగ్ కు సర్వం సిద్ధం...

చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలోని 2877 పోలింగ్​ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 23 వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి ఎన్నికల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా 10,791 బ్యాలెట్, 3,594 కంట్రోల్​, 4025 వీవీ ప్యాట్​ యూనిట్ యంత్రాలను అందుబాటులో ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. అయితే పోలింగ్​ కేంద్రాలకు తరలించేందుకు పోలీస్​ బందోబస్తు తో ప్రణాళిక చేశారు.

సామగ్రి పంపిణీ...

పార్లమెంట్​ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను ఎంపిక చేసి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. బాలాపూర్​ మండలం బడంగ్​పేట్​ స్పూర్తి ఇంజనీరింగ్​ కాలేజీలో మహేశ్వరం, రాజేంద్రనగర్​ మండలంలోని ఓల్డ్​ వెటర్నరీ కాలేజీలో రాజేంద్రనగర్​, శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని జీఎంసీ బలయోగి ఇండోర్​ స్టేడియం శేరిలింగంపల్లి, చేవెళ్ల మండలం గోల్లేపల్లి గ్రామంలోని బండారీ శ్రీనివాస్​ ఇన్స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో చేవెళ్ల, పరిగి మండల కేంద్రంలో మినీ స్టేడియంలో పరిగి, వికారాబాద్​ మండల కేంద్రంలో మేరీ ఏ కొంటు స్కూల్​లో వికారాబాద్​, తాండూర్​ మండల కేంద్రంలో సెయింట్​ మెక్స్​ ఇంటర్​నేషనల్ హైస్కూల్​లో తాండూర్​ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారానే పోలీంగ్​ సామాగ్రిని పోలింగ్​ కేంద్రాలకు తరలించనున్నారు. పోలింగ్​ ముగిసిన తర్వాత తిరిగి పోలింగ్​ సామాగ్రిని ఆదే కేంద్రాల్లో సిబ్బంది అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల ఈవీఎంలను చేవెళ్ల మండలం గొల్లెపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్​ ఇన్స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ లో స్ట్రాంగ్​ రూమ్​లో భద్రపర్చనున్నారు. ఈ కేంద్రం నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి బందోబస్తు...

పార్లమెంట్​ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పూర్తిగా ఆ సమయం అంతా సైలెంట్ మూడ్​గానే ఎన్నికల అధికారులు పరిగణించనున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News