ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో మన కూరగాయల మార్కెట్లు

అత్త సొమ్ము అల్లుడి దానం అన్న చందంగా తయారైంది కూకట్​పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తుల పరిస్థితి. రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన మన కూరగాయల మార్కెట్లు ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయి.

Update: 2024-05-16 02:24 GMT

దిశ, కూకట్​పల్లి : అత్త సొమ్ము అల్లుడి దానం అన్న చందంగా తయారైంది కూకట్​పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తుల పరిస్థితి. రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన మన కూరగాయల మార్కెట్లు ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయి. వాటిని కిరాయిలకిచ్చి లక్షలు దండుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ‘మన రైతన్నలు పండించిన కూరగాయలను కొని రైతన్నలను ఆదరిద్దాం’ అన్న నినాదంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, జీహెచ్ఎంసీ పది శాతం స్థలాల్లో ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా మన కూరగాయల మార్కెట్లను ప్రారంభించింది. కొంతకాలం తర్వాత ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో మార్కెట్ మూత పడ్డాయి. మూతపడిన మన కూరగాయల మార్కెట్, ప్రభుత్వ ఆస్తులను కొంత మంది బీఆర్​ఎస్ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు కిరాయికి ఇచ్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నుంచి ఇటు జీహెచ్ఎంసీ, అటు మార్కెటింగ్​శాఖ అధికారులు కాపాడ కపోవడంతో నెల నెల కొన్ని లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల చేతులు మారుతున్నాయి.

ఉదాహరణకు కొన్ని..

*కేపీహెచ్బీ డివిజన్​ సర్దార్​ పటేల్​ నగర్​ కాలనీలోని కమ్యూనిటీ హాల్​ ఎదురుగా హైటెన్షన్​ లైన్​ కింద సుమారు 300 గజాల స్థలంలో భారీ షెడ్డు నిర్మించి మన కూరగాయల మార్కెట్​ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో ఓ ఫ్లెక్సీ ప్రింటింగ్​వ్యాపారం నిర్వహిస్తున్నారు.

* కేపీహెచ్​బీ డివిజన్​ వసంత్​నగర్​ కాలనీ నుంచి 9 ఫేజ్​ వెళ్లే దారిలో జీహెచ్ఎంసీ పార్కు స్థలంలో సుమారు 200 గజాల స్థలంలో మన కూరగాయల మార్కెట్​ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం అందులో ఫుడ్​ కోర్టు, హోటల్​లకు కిరాయికి ఇచ్చారు.

* బాలాజీ నగర్​ డివిజన్​ ధనలక్ష్మి సెంటర్​ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మన కూరగాయల మార్కెట్​ స్థలాన్ని స్థానిక నాయకులు కొంత మంది చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు.

Similar News