చిన్నారుల ప్రాణాలతో చెలగాటం.. అనుమతి లేకుండా స్విమ్మింగ్ పూల్..?
చిన్నారుల ప్రాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎండలు తీవ్రం కావడంతో చిన్నాపెద్దా లేకుండా అందరూ చల్లదనం కోసం వెతుకుతున్నారు.
దిశ, రాజేంద్రనగర్: చిన్నారుల ప్రాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎండలు తీవ్రం కావడంతో చిన్నాపెద్దా లేకుండా అందరూ చల్లదనం కోసం వెతుకుతున్నారు. అదేవిధంగా పాఠశాలలకు సెలవులు కావడంతో చిన్నారులు ఈతను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్‌లో కనీస నిబంధనలు పాటించడం లేదని చెబుతున్నారు. అత్తాపూర్‌లోని ఎడిఫై పాఠశాల సమీపంలో ఎస్‌వైఆర్ పేరుతో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇందులో జీహెచ్ఎంసీ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. గంటకు రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎండలు తీవ్రం కావడంతో ప్రతిరోజూ వందలాది మంది స్విమ్మింగ్ పూల్‌ను ఆశ్రయిస్తున్నారు. "
నిబంధనలకు నీళ్లు..
స్విమ్మింగ్ పూల్‌లో జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించాల్సి ఉంది. అత్తాపూర్ లోని ఎస్ వై ఆర్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వాహకులు తమ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్‌లో రోజూ ఉదయం, సాయంత్రం వందలాది మంది చిన్నారులు ఈత నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ కోచర్లు ఏమాత్రం లేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
స్విమ్మింగ్ పూల్‌లో జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్వహించాలి. తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలి. ఎస్‌వైఆర్ స్విమ్మింగ్ పూల్ విషయంలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. చిన్నారుల రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు. :- రవికుమార్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్రనగర్ సర్కిల్