అక్రమార్కులకు అధికారుల అండ..! ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక ఓడిదుడుకులను అధిగమించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా పని చేయడంతో పాటు, అవసరమైతే నిబంధనలు సడలించి ఆదాయాన్ని సమకూర్చే మార్గాలు ఎంచుకోవాలి.

Update: 2024-05-24 02:00 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక ఓడిదుడుకులను అధిగమించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా పని చేయడంతో పాటు, అవసరమైతే నిబంధనలు సడలించి ఆదాయాన్ని సమకూర్చే మార్గాలు ఎంచుకోవాలి. కానీ రంగారెడ్డి జిల్లాలోని అధికారులు, సిబ్బంది ప్రభుత్వ పరిపాలనతో తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలపై ఆధారాలతో సహా పత్రికల్లో కథనాలు వచ్చినా పట్టించుకోని అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తూతూ మంత్రంగా కూల్చివేతలతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చేవెళ్ల మండలంలోని ఆలూర్​, దామెరగిద్ద, చేవెళ్ల, కందవాడ, పామెన, బస్తేపూర్, దేవునిఎర్రవల్లి, కమ్మెట, ముడిమాల, నాలెట, రామన్నగూడ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్​ల్యాండ్ నిర్మాణాలు చేస్తున్నారు. కోట్లల్లో వ్యాపారం సాగుతున్న ఆయా గ్రామాల్లోని పంచాయతీలకు రావాల్సిన పన్ను, 10శాతం భూమిని మింగేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ, మైనింగ్​, పంచాయతీ అధికారుల్లో సమన్వయం లోపం అక్రమార్కులకు కలిసొస్తోంది. రెవెన్యూ అధికారులు గుంటల్లో భూమిని రిజిస్ట్రేషన్లు చేస్తే.. పంచాయతీ అధికారులు కేవలం ప్రహరీలే కదా అని వదిలేస్తూ తప్పిదాలకు పాల్పడుతున్నారు. ఈ తప్పిదాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది.

అదే రెవెన్యూ అధికారులు గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారి పాసుబుక్​లోని విస్తీర్ణం పూర్తిగా క్రయ విక్రయాలైతున్నప్పుడు అధికారులకు అనుమానం రావాలి. కానీ ఆ అనుమానాలను ఆసరాగా చేసుకొని రియల్​ వ్యాపారుల వద్ద చేతివాటలకు ఆలవాటు పడుతున్నారు. ఇదే దుస్థితిని పంచాయతీ అధికారులు అవలంబిస్తున్నారు. పంచాయతీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తూ తప్పిదాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయం సంబంధిత అధికారులు, సిబ్బంది చేతుల్లోకి వెళ్లడం గమానార్హం.

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

రియల్​ వ్యాపారులు చేసే తప్పిదాలను ఆసరాగా చేసుకుని అధికారులు సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. కానీ ప్రభుత్వ నిబంధనలను అమలు చేసే బాధ్యతను సంబంధిత అధికారులు పూర్తిగా మర్చిపోయారు. ఎవరైనా స్థానికులు నిబంధనలకు విరుద్ధంగా రియల్​ వ్యాపారం సాగుతుందని ఫిర్యాదులు చేస్తే పట్టించుకునే పాపాన పోవడం లేదు. అంతేగాక స్థానికంగా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి రియల్​వ్యాపారులకు, అధికారులకు మధ్యవర్తులు వ్యవహరించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ నిబంధనలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా గ్రామాల్లోని మాజీ సర్పంచులు ఇంకా అధికార దాహంతో పంచాయతీ కార్యదర్శులపై పెత్తనం చేస్తూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు.

Similar News