లేఖ్య వర్ధిత పై యాసిడ్ దాడి జరగలేదు : వైస్ ఛాన్స్ లర్

లేఖ్య వర్థితపై ఎలాంటి యాసిడ్ దాడి జరగలేదని ఇక్ఫాయి కళాశాల వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఎల్.ఎస్ గణేష్, రిటైర్డ్ కల్నల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ విశ్వనాథ్ లు తెలిపారు.

Update: 2024-05-17 14:29 GMT

దిశ,శంకర్ పల్లి : లేఖ్య వర్థితపై ఎలాంటి యాసిడ్ దాడి జరగలేదని ఇక్ఫాయి కళాశాల వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఎల్.ఎస్ గణేష్, రిటైర్డ్ కల్నల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ విశ్వనాథ్ లు తెలిపారు. శంకరపల్లి మండలం దొంతాన్ పల్లి లోని ఇక్ఫాయి కళాశాలలో ప్రొఫెసర్ అక్బర్, డాక్టర్ చిత్రలతో కలిసి వారు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ కళాశాలలో బి.బి. ఏ ( ఎల్.ఎల్.బి ) తృతీయ సంవత్సరం చదివే లేఖ్యవర్ధిత ఈనెల 15న బుధవారం గం. 7.30ల కు హాస్టల్ గదిలో స్నానం చేసేందుకని వేడి నీరు ఒంటిపై పోసుకోగా శరీరం కాలిందని వారు వివరించారు. వెంటనే ఆమె బయటకు వచ్చి జరిగిన విషయాన్ని సెక్యూరిటీ గార్డ్ తో పాటుగా, హాస్టల్ వార్డెన్ కు తెలిపిందని అన్నారు.

హాస్టల్ వార్డెన్ విద్యార్థి లేఖ్య వర్దిత ను కళాశాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం కళాశాలకు చెందిన అంబులెన్స్ లో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించామని తెలిపారు. తాము కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి లేఖ్య వర్ధిత బాగోగులు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. వారి కుటుంబీకులు మరింత మెరుగైన చికిత్స కోసం కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారని, 40 శాతం గాయాలతో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.

మోకిల పోలీసులు కళాశాలలో విద్యార్థి ఉండే హాస్టల్ గది లో క్లూస్ టీం తో పూర్తి వివరాలను సేకరించారని, కేసు విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు. బాత్రూంలను శుభ్రపరిచే వస్తువుల గది తాళాలు సైతం తమ సిబ్బంది వద్దనే ఉంటాయని, బాత్రూంలను శుభ్రపరిచే లిక్విడ్ స్నానం చేసే నీటిలో కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. హాస్టల్ గదిలో ఆమె ఒక్కతే ఉందని, ఆమెపై ఎలాంటి యాసిడ్ దాడి జరగలేదని వారు తెలిపారు.

Similar News