ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన వసతులు కల్పించాలి

రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి, రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్ లు అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు.

Update: 2024-05-23 12:40 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి, రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్ లు అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్​ మెట్ మండలం, బాచారం గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శశాంక్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలన్నారు.

     రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి, రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్ లు అందించాలన్నారు. కేంద్రాల వద్ద సరిపడ సంఖ్యలో హమాలీలు సేవలందించేలా ఏర్పాట్లు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్ లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని, ధాన్యం నిల్వలు తరలించేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాలు కూరుస్తున్నందున

    రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ముందస్తుగానే వారిని అప్రమత్తం చేయాలని, తద్వారా ఆరబోసిన ధాన్యం తడవకుండా వారు జాగ్రత్తలు చేపట్టేందుకు వీలుంటుందని

    అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లో 33 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 17 కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని, ఎక్కడ కూడా తరుగు వంటివి లేకుండా గట్టి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉంచామని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తేవచ్చని, జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కలెక్టర్ వెంట డీసీఓ ధాత్రి దేవి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మనోహర్ కుమార్ రాథోడ్, సివిల్ సప్లైస్ డీఎం విజయ లక్ష్మీ, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Similar News