ఆమనగల్లు మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు.

Update: 2023-05-17 16:45 GMT

దిశ, ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. వివిధ పథకాలలో భాగంగా రూ.102 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో బుధవారం TUFIDC నిధులు రూ.15 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో మూడు పార్కుల నిర్మాణానికి రూ. 2.10 కోట్లు, ఆమనగల్లు సురసముద్రం సుందరీకరణ పనులకు రూ. 2.50 కోట్లు, గాంధీ చౌక్ నుంచి సురసముద్రం చెరువు కట్ట వరకు రూ. 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్, రూ. 2.80 కోట్లతో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ 1.50 కోట్లతో గ్రంథాలయ భవన నిర్మాణం, 2.50 కోట్లతో కళాశాల భవన నిర్మాణం, రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం, రూ. 2 కోట్లతో సేవాలాల్ భవన నిర్మాణం, రూ. 50 లక్షలతో వివిధ సామాజిక భవనాల నిర్మాణం, రూ. కోటితో దోబి ఘాట్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆమనగల్లు మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆమనగల్లు విటాయిపల్లి మధ్య నుంచి త్వరలో RRR రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రధాన కేంద్రమైన ఆమనగల్లు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి కడ్తాల్ మండలాలకు కలిపి ఆమనగల్లులో వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయం మంజూరు అయిందని త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, సుజాత, విక్రమ్ రెడ్డి, కృష్ణ, జ్యోతి, దివ్య, విజయ్, రాధమ్మ, సోనీ, చెన్నకేశవులు, ఝాన్సీ, యాదమ్మ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News