హార్డ్​ వేర్​ పార్కు కంపెనీలో అగ్ని ప్రమాదం

హార్డ్​ వేర్​ పార్క్​లోని శ్రీనాథ్​ వోవెన్​ ప్యాక్​ లిమిటెడ్​ కంపెనీలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.5 కోట్ల 53 లక్షల ఆస్తినష్టం సంభవించిందని యజమాని శనివారం రాత్రి పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Update: 2024-05-25 15:35 GMT

దిశ, బడంగ్ పేట్​ : హార్డ్​ వేర్​ పార్క్​లోని శ్రీనాథ్​ వోవెన్​ ప్యాక్​ లిమిటెడ్​ కంపెనీలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.5 కోట్ల 53 లక్షల ఆస్తినష్టం సంభవించిందని యజమాని శనివారం రాత్రి పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పహాడిషరీఫ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... శంషాబాద్​ కు చెందిన పిరిడి రాజు (51) కు చెందిన మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల గ్రామంలో శ్రీనాథ్​ వోవెన్​ ప్యాక్​ లిమిటెడ్​ కంపెనీలో ఈనెల 24వ తేదీన రాత్రి 8.25 గంటలకు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ప్రధానంగా ప్లాస్టిగ్​ బ్యాగ్​ లు తయారు అవుతుండడంతో మంటలు పెద్ద ఎత్తున విస్తరించాయి. ఆ సమయంలో అందులో చిక్కుకున్న 15 నుంచి 20మంది కార్మికులు

     సెక్యూరిటీ సహాయం తో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పహాడిషరీఫ్​ పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 6 ఫైర్​ ఇంజన్​ల ద్వారా శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే అందులోని మొక్కలు, యంత్రాలు, కంప్రెషర్​లు, 16 స్టిచింగ్​ మిషన్​లు, వెల్డింగ్​ మిషన్, ఇతర సామగ్రితో పాటు షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దీంతో బాధితుడు రాజు రూ.5 కోట్ల 53 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయని పహాడిషరీఫ్​ పోలీసులకు శనివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకు అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందన్న విషయం తేలాల్సి ఉంది. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News