న్యాయవ్యవస్థ సహకారం అవసరం..

రైతు బాగుంటేనే మనమంతా సురక్షితమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు.

Update: 2023-02-15 16:03 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : రైతు బాగుంటేనే మనమంతా సురక్షితమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా న్యాయమూర్తి కే.సుదర్శన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతుల సమస్యలు తీర్చేందుకు, రెవెన్యూ సమస్యలను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

భూముల రికార్డులను సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాన్యాయమూర్తి కే.సుదర్శన్ మాట్లాడుతూ భూముల సమస్యల పరిష్కారంలో మా సహకారం ఉంటుందని అన్నారు. భూ సమస్యలు పరిష్కారం అయితే 30 శాతం సివిల్ కేసులు తగ్గుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే.మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

నీటి పారుదల శాఖ, బ్లాక్ క్వార్టర్స్ స్థలాల పరిశీలన

అంతకుముందు కోర్టు సముదాయానికి స్థలం సరిపోకపోవడంతో ఇబ్బంది అవుతున్న దృష్ట్యా జిల్లా జడ్జితో కలిసి నీటిపారుదల శాఖ, బ్లాక్ క్వార్టర్స్ కు కేటాయించిన స్థలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఇట్టి స్థలాలు సర్వేచేసి నివేదికలు సమర్పించాలని తహసిల్దారును కలెక్టర్ ఆదేశించారు.

Tags:    

Similar News