ప్రాణాలు కోల్పోతేనే అధికారులు స్పందిస్తారా.. ప్రాణాంతకంగా మారిన మూల మలుపు

తలకొండపల్లి మండలం నుంచి మిడ్జిల్ మండల కేంద్రానికి సుమారు 20

Update: 2024-05-10 11:53 GMT

దిశ,తలకొండపల్లి : తలకొండపల్లి మండలం నుంచి మిడ్జిల్ మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం డబుల్ రోడ్డు కలిగి ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాగా కొనసాగుతున్న సమయంలో తలకొండపల్లి మండలం నుంచి ప్రతి నిత్యం వందలాది మంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ఈ రహదారి పై నుండి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామం శివారు ప్రాంతం వరకు ఈ ప్రధాన రహదారిపై సుమారు 7 కల్వట్లు గత పది సంవత్సరాల కాలం నుండి అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ రహదారి పనులు పూర్తయిన కల్వట్లు పనులు మాత్రం నేటికీ అసంపూర్తిగా మిగిలిపోవడం తో ఎంతో మంది ప్రయాణికులకు ప్రతినిత్యం నరకయాతన తప్పడం లేదు. కల్వర్టు నిర్మాణం కోసం నిధులు ఉన్న పనులు పూర్తి చేయించడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని అపవాదు మూట కట్టుకున్నారు.

మృత్యు ఘోష గా మారిన మూల మలుపు

తలకొండపల్లి నుండి మిడ్జిల్ మండలాల కూడలికి ఈ రహదారి అత్యంత ప్రధానమైనది. వెల్జాల్ గ్రామ శివారు ప్రాంతంలోని రామాసిపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు మలుపు ప్రజల ప్రాణాల పాలిట మృత్యు ఘోష గా మారింది. ఈ మలుపు వద్ద గతంలో సుమారు 10 నుంచి 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయి, కాళ్లు చేతులు పోగొట్టుకున్న కుటుంబాల వారు కోకొల్లలుగా ఉన్నారు. గతంలోని అధికారులు స్పందించి ఈ మలుపు ప్రదేశంలో రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ డివైడర్ పైపులను ఏర్పాటు చేసి ఉంటే ఆ ఇద్దరి యువకుల ప్రాణాలు కోల్పోయేవి కావని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోడ్డుపై క్రాసింగ్ ల వద్ద చెట్లను తొలగించకపోవడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.ఇటీవల ఆమనగల్ నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై మాత్రం మూలమలుపుల వద్ద డివైడర్ మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు జరగకుండా రోడ్డు మధ్యలో సూచిక పైపులను ఏర్పాటు చేశారని, అదే పైపులను మిడ్జిల్ నుండి తలకొండపల్లి రెండు మండలాలకు ప్రధాన రహదారి అయిన ఈ డబుల్ రోడ్ లో ఎందుకు ఏర్పాటు చేయలేదని బాధితులు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల ముందు చూపు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు..

గత రెండు రోజుల క్రితం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచార కార్యక్రమాన్ని ముగించుకొని మిడ్జిల్ మండలం మీదుగా కల్వకుర్తి బయలుదేరిన సమయంలో అతని వాహనం ఢీకొని రామాసిపల్లి మైసమ్మ క్రాసింగ్ వద్ద ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చిన ఇద్దరి యువకులు ప్రాణాలను బలిగొన్న అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి కొంటే తప్ప అధికారులు స్పందిస్తారొనని సమీప గ్రామాల ప్రజలు అగ్గిలం మీద గుగ్లమవుతున్నారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచిన తర్వాత కూడా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో చివరకు కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను మందలించడంతో తలకొండపల్లి ఆర్ అండ్ బి ఏఈ రవితేజ శుక్రవారం ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని ఈ డేంజర్ మలుపు వద్ద స్పీడ్ బ్రేక్ లను ఏర్పాటు చేయడానికి పరిశీలన చేశారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ మూలమలుపు వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News