ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరు మృతి.. ముగ్గురు సీరియస్

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు గురువారం తెల్లవారు జామున బోల్తా పడింది.

Update: 2024-05-23 01:57 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్‌పై ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు గురువారం తెల్లవారు జామున బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్‌కు చెందిన ఫర్హాన (20) సంవత్సరాల యువతి మృతి చెందింది. మరొకరిని హైదరాబాద్ తరలించారు.

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్స్ వద్దకు రాగానే డ్రైవర్ అతివేగంగా నడపడంతో కంట్రోల్ తప్పి బోల్తా పడిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కొందరికి కాళ్లు విరిగితే, కొందరికి చేతులు, నడుము విరిగాయని తెలిపారు.

గాయపడ్డ ప్రయాణికులకు సేవలు అందించిన నిర్మల్ యువకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని, సూపరిండెంట్‌కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారని జిల్లా మెడికల్ ఆసుపత్రి నిర్మల్‌లో ఉండి ఏం ప్రయోజనం అని అత్యవసర వైద్య సేవలు అందించలేని ఆసుపత్రి ఎందుకని ప్రశ్నించారు . రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోర్లా పడిందని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.

Similar News