కొత్తచెరువు కనుమరుగు?

గండిపేట్ మండ‌ల ప‌రిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాల‌ను కాపాడే నాథుడు క‌రువ‌య్యాడు...

Update: 2024-05-25 02:23 GMT
  • బీజేఎంసీ కొత్తచెరువు అన్యాక్రాంత‌ం
  • ఇరిగేష‌న్‌, రెవెన్యూ శాఖ‌లది త‌లోదారి
  • చెరువును కాపాడాల‌ని స్థానికకుల విన‌తి
  • స్పందించేందుకు వెనుకడుగు వేస్తున్న ఇరిగేష‌న్‌, రెవెన్యూ సిబ్బంది

దిశ‌, గండిపేట్: గండిపేట్ మండ‌ల ప‌రిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాల‌ను కాపాడే నాథుడు క‌రువ‌య్యాడు. ఖాళీగా క‌నబడిన ప్రతి చెరువు, కుంట‌ను క‌బ్జా చేయ‌డం.. అమ్మి సొమ్ము చేయ‌డం క‌బ్జాదారుల ప‌ని.. ఇందుకు వంత ప‌డేది అధికారులు.. ఇలా అధికారులు, ప్రజా ప్రతినిధులు క‌బ్జాదారుల స‌హాయ స‌హ‌కారాలు ఇస్తుంటే స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంత‌మ‌వుతున్నాయి. మండల ప‌రిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లోని స‌ర్వే నంబ‌ర్ 66 లోని కొత్త చెరువు క‌నుమ‌రుగు అవుతుంది. చెరువులు, కుంట‌లు అన్యాక్రాంతం కావ‌డంతో స్థానికంగా ఎదుర‌య్యే ప‌ర్యావ‌సానాల గురించి అధికారుల‌కు తెలిసి మౌనంగా ఉంటున్నారా? అనే సందేహాన్ని ప్రజ‌లు వ్యక్తం చేస్తున్నారు. కొత్త చెరువును ప‌రిర‌క్షించాల‌ని గ‌త నెల రోజులుగా స్థానిక నాయ‌కులు, పాత్రికేయులు ప్రయ‌త్నాలు చేస్తున్నా అధికారులు మాత్రం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. ఈ చెరువును సంర‌క్షించుకుంటే చుట్టుప‌క్కల ప్రాంతాల వారికి భూగ‌ర్భ జ‌లాలు ఎండిపోకుండా ఉంటాయ‌నేది స్థానికుల వాద‌న‌. గ‌ట్టిగా ఈ విష‌యంపై నిల‌దీస్తే కొత్త చెరువు చిన్న చెరువు అని, ఆ చెరువుకు అంత ప్రాధాన్యం లేద‌ని బ‌దులు ఇస్తుండ‌డం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మిగులుతుంది. చెరువుల‌ను సంర‌క్షించాలి.. నాలాల‌ను కాపాడాల‌ని ఓ ప‌క్క రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్‌గా ప‌ని చేస్తుంటే.. క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారులు దానికి భిన్నంగా వ్యవ‌హ‌రించి కాసుల క‌క్కుర్తికి క‌బ్జాదారుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నారు. అధికారులే క‌బ్జారుల‌కు మార్గద‌ర్శకాలుచేసి చెరువులు ఎలా క‌బ్జా చేయాలో వారికి స‌ల‌హాలు ఇస్తున్నార‌ని స్థానికులు ఆరోపిస్తున్నార‌. దీనిపై ఇరిగేష‌న్ ఉన్న‌తాధికారి దాన‌కిషోర్ ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి అధికారులపై చ‌ర్యలు తీసుకొని చెరువులు, నాలాల‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. ఈ చెరువులు క‌బ్జాలు అవుతున్నాయ‌ని ఇరిగేష‌న్ అధికారుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చినా క‌నీసం కంటితుడుపు చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌ది త‌లోదారి..?

బండ్లగూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్ 66లోని కొత్త చెరువును కాపాడ‌డంలో అధికారులు వంక‌లు వెతుక్కుంటున్నారు. ఇరిగేష‌న్ అధికారులు ఈ అంశంపై స్పందించ‌రు. రెవెన్యూ అధికారులు ఇరిగేష‌న్ ప‌రిధిలోకి వస్తుందంటూ దాట వేస్తారు. చెరువులు, నాలాల‌ను క‌బ్జా చేస్తూ ల‌క్షలు కోట్లు దండుకుంటున్నారు. చెరువు 4.13 ఎక‌రాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అంతే ఉందా? అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఎవ‌రి లాభం కోసం చెరువుల‌ను నాశనం చేస్తున్నారని ప్రజ‌లు ప్రశ్నిస్తున్నారు. చెరువుల‌ను నిర్వీర్యం చేసేందుకు అధికారులు కంక‌ణం క‌ట్టుకున్నారా? అనే అనుమానాన్ని ప్రజ‌లు వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు శాఖ‌ల అధికారులు కొత్త చెరువును కాపాడ‌డంలో మీమాంస‌లో ప‌డ‌డం అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం..

కొత్త చెరువు అంశంపై జ‌ల‌మండ‌లి మేనేజింగ్ డైరెక్టర్ దాన‌కిషోర్ ఆదేశాల మేర‌కు వ్యవహరిస్తాం. కొత్త చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ చెరువులో డ్రైనేజీ నీరు క‌ల‌వ‌కుండా చ‌ర్యలు తీసుకుంటాం.

- శ్రీ‌నివాస్‌రెడ్డి, గండిపేట్ త‌హ‌సీల్దార్

Similar News