సభ సక్సెస్... తెలంగాణ నేతల్లో ఫుల్ జోష్

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు సరిపడా స్థానాలు వచ్చే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.........

Update: 2024-05-01 04:15 GMT

దిశ, మెదక్ ప్రతినిధి/అల్లాదుర్గం: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు సరిపడా స్థానాలు వచ్చే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాల్ జనసభ మంగళవారం నిర్వహించారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థులు బీబీ పాటిల్, రఘునందన్ రావుకు మద్దతుగా మోడీ ముఖ్య అతిథిగా హాజరైన బహిరంగ సభకు అశేష సంఖ్యలో జనంహాజరయ్యారు.. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారం.. కేతకి సంగమేశ్వర, ఏడుపాయల దుర్గా అమ్మవారు, బసవేశ్వరునికి నమస్కారం’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూశారు. కాంగ్రెస్‌ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయిందని ప్రధానమంత్రి మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మోడీ బతికున్నంత వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి స్పందించారు.


తాను బతికి ఉన్నంత వరకూ రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పారు. భగవత్ గీత, బైబిల్ వలే భారత రాజ్యాంగం కూడా పవిత్రమైందన్నారు. రాజ్యాంగం అన్ని వర్గాల కోసం ఏర్పాటు చేయబడిందని, దళిత, ఓ బీసీల రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. మోడీ బతికి ఉన్నంత వరకు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాడని, దానిని ఎవరూ టచ్ కూడా చేయలేరని చెప్పారు. తాను ఉన్నంతవరకు రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు మొదటి నుంచి రాజ్యాంగం పట్ల విలువలేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగానికి తూట్లు పొడిచింది అని ఎద్దేవా చేశారు. దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బీసీ హక్కులను కాలరాస్తూ మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహిస్తుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కానివ్వమని అన్నారు. లింగాయత్ , మరాఠ సామ్రాజ్యం, 86 కులాలకు ఓబీసీ కేంద్ర జాబితాలో చోటు కల్పించడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని , కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా సమాజాన్ని నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా ఊరేగింపు చేశామని తెలిపారు. ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌కి ఎన్నికల కమిషన్ పై నమ్మకం ఉండదు. ఈవీఎంలపై నమ్మకం ఉండదని ఎద్దేవా చేశారు. సమ్మక్క, సారక్కకు భూమి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని ఆరోపించారు.

సిరిసిల్ల- సిద్దిపేట - మనోహరాబాద్ రైల్వే లైనుకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని, బీదర్- అకొల రైల్వే లైన్ కు కృషి చేస్తానని తెలిపారు. మెదక్ - ఎల్లారెడ్డి- బోధన్ - బైంసా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ఆందోల్ నుండి జుక్కల్ - నారాయణఖేడ్ నియోజకవర్గ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని అన్నారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను అమృత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేసినట్టు చెప్పారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీఈ పాటిల్, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ను భారీ మెజారిటీతో గెలిపించి అప్ కీ బార్ చార్ సౌ పార్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇద్దరు వేసే ఓటు మోడీకి చేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అరుణ తార, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభ సక్సెస్... నేతల్లో ఫుల్ జోష్

అల్లాదుర్గం శివారులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని మోడీ బహిరంగ సభ విజయవంతం అయింది. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ పరిధిలోని జన సమీకరణలో బీజేపీ శ్రేణులు సక్సెస్ అయ్యారు.. అంచనా మేరకు జనం రావడంతో పాటు మోడీ జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాటు మెదక్ ఉమ్మడి జిల్లాలో కేంద్రం చేపట్టిన పథకాలు, చేపట్టబోయే వాటిని వివరించడంతో జనాల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది.. ఇప్పటికే మోడీ క్రేజీ‌లో ఉన్న ప్రజలకు స్వయంగా ప్రధాని మోడీ వచ్చి ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అంటూ చేసిన ప్రసంగం‌తో సభ ఒక్కసారిగా ఈలాలు, కేరింతలతో మారుమోగింది.. మోడీ ప్రసంగంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అధికంగా ఉన్న లింగాయత్ వర్గంకు రిజర్వేషన్‌ల ప్రస్తావన చేయడంతో పాటు దళిత వర్గీకరణపై కూడా మోడీ చేసిన వ్యాఖ్యలు దళిత వర్గాల్లో ఉత్సాహం నింపాయి.. అలాగే ఏడుపాయల దుర్గా భవాని, బసవేశ్వర స్వామికి మోడీ దండం పెట్టి ప్రసంగాన్ని ప్రారంభించడంతో సభలో ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. మోడీ హిందీలో ప్రసంగిస్తూ ఉంటే మరో వ్యాఖ్యాత అనువాదం చేయడం మూలంగా మోడీ చెప్పే అన్ని అంశాలు ప్రజల్లోకి అర్థం అయ్యే విధంగా వెళ్లాయి. బీజేపీ శ్రేణులు, బరిలో ఉన్న అభ్యర్థులు ఉహించిన విధంగానే ప్రధాని మోడీ సభ విజయ వంతం కావడంతో బీజేపీ నేతల్లో మరింత జోష్ నింపింది.


Similar News