రిజల్ట్ ఎలా ఉన్నా 2 ప్లాన్‌లతో కాంగ్రెస్ స్ట్రాటజీ ఫిక్స్!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? అనుకున్నట్లుగానే డబుల్ డిజిట్ వస్తుందా?

Update: 2024-05-27 04:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? అనుకున్నట్లుగానే డబుల్ డిజిట్ వస్తుందా? కేంద్రంలో ‘ఇండియా’ కూటమి పవర్‌లోకి వస్తుందా? అంచనాలు తప్పితే వచ్చే రాజకీయ చిక్కులేంటి? కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి? రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా? ఇవీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న అంశం. రాష్ట్రంలో 17 స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగులతో అధికారిక కార్యకలాపాల్లో మునిగిపోయిన సీఎం రేవంత్... పొలిటికల్ పరిస్థితులపైనా లోతుగా ఆలోచిస్తున్నారు. ఇంటికే పరిమితమైన ఆయన పార్టీ లీడర్లతో, కొద్దిమంది మేధావులతో మాట్లాడుతున్నారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు పరిణామాలపై ప్లానింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

రెండు రకాల వ్యూహాలతో..

లోక్‌సభ ఫలితాలకు అనుగుణంగా రానున్న పరిణామాలపై రెండు రకాల వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి స్వర్ణయుగమేనని, ఆర్థిక సహకారం అందుతుందని, అభివృద్ధి పనులకు క్లియరెన్స్ వస్తుందని, ఏకకాలంలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు రాష్ట్రంలో రాజకీయంగా సమాధి తప్పదన్నది కాంగ్రెస్ ధీమా. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందుతుందని, ఐదేండ్ల కాలంలో ఊహించని ఫలాలు అందుకునే వీలు ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. కేంద్రంలో ఈసారి ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఖాయమని, జూన్ 9వ తేదీన రామ్‌లీలా మైదానంలో రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఓపెన్ కామెంట్ చేశారు.

కేంద్రంలో పరిస్థితిపై అలాంటి వైఖరితో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలో బీజేపీ గెలుపొందే స్థానాలపైనా లోతుగానే ఆలోచించింది. గతంలో నాలుగు స్థానాలున్న ఆ పార్టీ ఇప్పుడు డబుల్ అయితే కొంత తేడా ఉంటుందని, కంట్రోల్ చేయడానికి పకడ్బందీ ప్లాన్ తప్పదనే అభిప్రాయంతో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, ‘ఇండియా’ కూటమికి అది పాజిటివ్ అవుతుందని భావిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌కున్న అనుకూల పవనాలతో డజను సీట్లు ఖాయమనే ధీమాతో ఉన్నా.. పోలింగ్ అనంతర పరిస్థితులు, పబ్లిక్‌లోని జనరల్ టాక్‌కు అనుగుణంగా 9-13 మధ్య రావచ్చన్న అంచనాకు వచ్చింది. ఈ అంచనా తప్పి రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఏం చేయాలనే ప్లాన్‌పై సీఎం రేవంత్‌ సహా సీనియర్ లీడర్లు ఆల్టర్నేట్ స్ట్రాటజీని సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

ఎన్డీయే అధికారంలోకి వస్తే..

కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ప్రధానిగా మోడీ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని కూడా కాంగ్రెస్ నేతలు సీరియస్‌గానే తీసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్ పబ్లిక్ మీటింగ్‌లలోనే వ్యాఖ్యానించి సీరియస్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు తగినట్లుగా కౌంటర్ స్ట్రాటజీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో బీజేపీ లీడర్లను ఫస్ట్ రోజు నుంచే ఉక్కిరిబిక్కిరి చేసేలా వారి ఎత్తుగడలను చిత్తు చేసి డిఫెన్సులో పడేసేలా ఆలోచిస్తున్నది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోగా తరచూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టించవచ్చనే అనుమానాలు కాంగ్రెస్‌కు మొదటి నుంచీ ఉన్నాయి. రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలూ ఉన్నాయి. ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదంటూ బీఆర్ఎస్, బీజేపీ తరచూ విమర్శలు చేస్తుండడం గమనార్హం.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే మొదటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలన్నది కాంగ్రెస్ వైఖరిగా కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసే తీరులో అవసరమైతే నిరసన కార్యక్రమాలూ నిర్వహించాలనే అభిప్రాయం కొందరు హస్తం నేతల నుంచి వ్యక్తమవుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు నిలదీయడంతో అదే వ్యూహాన్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపైనా ప్రయోగించాలన్నది వీరి వాదన. పదేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో ప్రశ్నిస్తూ ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ఎంపీలకు కంటిమీద కునుకు లేకుండా చేయాలన్నది వీరి ఉద్దేశం.

సైద్ధాంతిక పోరాటం..

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడితే మాత్రం బీజేపీ మీద సైద్ధాంతిక పోరాటం తప్పదంటూ ఇప్పటికే ఏఐసీసీ నుంచి సంకేతాలు అందాయి. పీసీసీ సీనియర్లకు రాహుల్‌గాంధీ సైతం ఇటీవల ఈ తరహాలో దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బీజేపీకి వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటం చేయడం ద్వారానే కాంగ్రెస్ మనుగడ ఉంటుందన్నది దాని వెనక ఉన్న ఉద్దేశం. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే బీజేపీ ఎంపీలను డిఫెన్సులో పడేసేలా కాంగ్రెస్ కార్యాచరణ ఉండాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొనడం సాధ్యమవుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన. తద్వారా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రావాలనుకునే లీడర్లు బీజేపీవైపు చూడకుండా ఉంటారన్నది కూడా మరో అభిప్రాయం.

Similar News