ప్రభుత్వాసుపత్రిలో కుళ్లిన పురుగుల భోజనం.. పట్టించుకోని అధికార గణం

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు వైద్యం సంగతి అటు ఉంచితే.. నాణ్యమైన భోజనం పెట్టలేని దుస్థితి నెలకొంది.

Update: 2024-05-26 04:37 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు వైద్యం సంగతి అటు ఉంచితే.. నాణ్యమైన భోజనం పెట్టలేని దుస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రిలో చేరే నిరుపేద రోగుల బంధువులకు వడ్డించే ఆహారంలో కుళ్లిపోయిన గుడ్లు, పురుగులతో కూడిన ఆహారం అందిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల నుంచి నుంచి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్న సదరు కాంట్రాక్టర్ రోగుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఆసుపత్రిలో ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ ప్రతినెలా ప్రభుత్వం నుంచి రూ.లక్ష దండుకుంటున్నా.. రోగులకు సహాయకులుగా వచ్చే వారికి నాణ్యమైన ఆహారం అందించని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ నిర్వాహకుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి‌తో పాటు, బోధన్, ఆర్మూర్‌లో కూడా గత కొన్నేళ్లుగా ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. తాజాగా, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహె‌చ్)లో ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చిన రోగులు వారి బంధువులకు వడ్డించిన భోజనం ఫొటోలు, వీడియో‌లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రోగుల డైట్‌కు సంబం‌ధించి రూ.లక్షల్లో బిల్లులు అందిస్తుంది.

అయితే, పర్యవేక్షణ చేయాల్సిన జీజీ హెచ్ అధికారులు చోద్యం చూడటంతో కాంట్రాక్టర్ రోగులకు ఆధ్వానమైన ఆహారం అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుళ్లిన గుడ్లు అందిస్తున్నారని ఆరోగ్యశ్రీ రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నాసిరకం భోజనం గురించి ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే తినండి లేదంటే లేదంటూ నిర్వాహకులు దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ వేద రోగులకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించడంతో పాటు అన్ని వసతులు సౌకర్యాలు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ ఆయన నిర్లక్ష్య వైఖరి వల్ల పేదలకు వారి బంధువులకు సరైన ఆహారం అందివ్వని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా కలెక్టర్ ఈ విషయంలో వెంటనే స్పందించి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన సదరు ఏజెన్సీ నిర్వాహకుడు‌పై చర్యలు తీసుకుని కొత్త వారికి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

Similar News