కామారెడ్డి వ్యవసాయ ఆధారిత ప్రాంతం

కామారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో సౌమ్యులని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-05-24 14:48 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో సౌమ్యులని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, ప్రజాభిప్రాయం, ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడానికి జిల్లాకు వచ్చిన 27 మంది కేంద్ర సెక్రటేరియేట్ బృందంతో శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మానవ వనరుల అభివృద్ధి ఆధ్వర్యంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం ఈ నెల 20 నుండి 24 వరకు ఐదు రోజుల పాటు జిల్లాలోని పద్మాజివాడ, శివాయిపల్లి, నర్సన్నపల్లి, దోమకొండ, ఫరీద్ పేట గ్రామాల్లో అమలవుతున్న పలు కార్యక్రమాలను నిశితంగా అధ్యయనం చేసి సందేహాలను ప్రస్తావించడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు.

    బృందం ఐదు రోజుల పాటు పాఠశాలలు, డిజిటల్ తరగతులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ ఉపాధి హామీ పనులు, స్వయం సహాయక బృందాల పనితీరు, ఆసుపత్రులు, విద్యుత్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, అంతర్గత రహదారులు తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ కార్యక్రమాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరిన నాడే పథకాలకు సార్థకత, నిజమైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, టాయిలెట్స్,

     చిన్న చిన్న మరమ్మతులు వంటివి చేపడుతున్నామన్నారు. విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలలో సోలార్ ప్యానల్ ల ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా రెండు పడకల ఇండ్ల కేటాయింపు, వివిధ రకాల పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ప్రతి కార్యక్రమం డబ్బుతో ముడిపడి ఉంటుందని, చాలా జాగ్రత్తగా కార్యక్రమాలు అమలు చేయవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీఓ చందర్, ఉమ్మడి జిల్లా హెచ్.ఆర్.డి. డా. వసుంధర పాల్గొన్నారు. 

Similar News