ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ సీజ్ కు రంగం సిద్ధం

ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో పక్కన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Update: 2024-05-09 09:12 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో పక్కన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సుమారు నెలరోజుల కిందటే లీజు దారుడు విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు మాల్ లీజు డబ్బులను చెల్లించాలని ఆర్టీసీ అధికారులు నోటీసులను అందజేశారు. అద్దె బకాయిలు చెల్లించాలని లీజు దారుడికి నోటీస్ ఇచ్చినా స్పందించక పోవడంతో హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన అధికారులు గురువారం మాల్ ను సీజ్ చేయాలని నిర్ణయించారు.

     మాల్ లో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారికి మాల్ ను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థకు లీజు దారుడు 3 కోట్ల 14 లక్షల బకాయి ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టీసీ ప్రత్యేక అధికారులతో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ ఎం శంకర్, ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు, డిపో సూపర్వైజర్ పారు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా సీజ్​ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆర్మూర్ ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని మాల్ ను నిర్మించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ సీజ్ ఘటనపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News