ముస్లింలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్లు కల్పించింది మోడీనే

ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయకపోగా జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తామని పూటకో మాట మాట్లాడుతున్నాడని, భవిష్యత్తులో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే 420గా మిగిలిపోతారని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు.

Update: 2024-05-01 13:05 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయకపోగా జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తామని పూటకో మాట మాట్లాడుతున్నాడని, భవిష్యత్తులో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే 420గా మిగిలిపోతారని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. కోరుట్ల కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాటల్లో అంతర్యం అదేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసివేస్తారని ఒక బూటకపు ప్రచారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు మతప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని చెప్పినా వాటిని అమలు చేస్తుందని అన్నారు.

    హిందువులకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు, బీసీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను ఒక మతం ప్రాతిపదికన ముస్లింలకు ఎలా ఇస్తారని అన్నారు. దేశంలో అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని వారి కోసమే మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చారని, దేశంలో తొలిసారి ముస్లింలకు రిజర్వేషన్లు ఆయనే ఇచ్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ స్వయంగా జహీరాబాద్ లో క్లారిటీ ఇచ్చినా తాను బతికున్నంత వరకు రిజర్వేషన్లు తొలగించమని చెప్పినప్పటికీ కాంగ్రెస్ నాయకులు కారుకూతలు కూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చిన్నపిల్లవాడి మాదిరిగా హోదాను మరిచి ప్రధానిపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని, మోడీని గుజరాత్ వ్యక్తి అని సంభోదిస్తే తాను రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ వ్యక్తి అని సంబోధించవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన భాష మారుతుందని చెప్పానని, కానీ ఇప్పటికి కేసీఆర్ జమానాను రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ దేశంలో విజన్ ఉన్న

    నాయకుడని ఆయన వచ్చిన తర్వాతనే కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అయిందని, రామ మందిరం నిర్మాణం జరిగిందని, యూనిఫాం సివిల్ కోడ్ అమలవుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానానికి పోటీ పడుతుందన్నారు. తాను రాజకీయాల్లో విలాసాల కోసం రాలేదని, మోడీ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. 15 సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి ప్రజలకు, రైతులకు ఎలాంటి హామీ ఇవ్వాలో తెలియకుండానే మాట్లాడుతున్నారని, ఆయనను పోటీ చేయాలని ఎవరు ఫోర్స్ చేయలేదని గుర్తు చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 25న చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తున్నారన్నారు.

    ఇప్పుడు ఎన్నికల వేళ సెప్టెంబర్ 17న తెరిపిస్తామని రేవంత్ రెడ్డి చెబుతుండగా, చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు వేసిన కమిటీ 2025 డిసెంబర్ నాటికి తెరుస్తామని చెబుతుందని పేర్కొన్నారు. చెరుకు రైతులు ముఖ్యమంత్రి మాటలను నమ్మలేని పరిస్థితి దాపురించిందన్నారు. ముఖ్యమంత్రి వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఆయనకే క్లారిటీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నాయకులు పల్లె గంగారెడ్డి, మోహన్ రెడ్డి, శ్రవంతరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Similar News