కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

Update: 2024-05-22 11:25 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్ధం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చారని అన్నారు.

    ఇదే స్పూర్తితో పని చేస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించారు. ఆలస్యంగా పంట దిగుబడులు చేతికి అందిన ప్రాంతాల్లో ఇంకనూ సుమారు 23 చోట్ల కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, ఆర్ఐ లను నియమించి మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటవెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని, ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన కేంద్రాలలో పని చేసిన హమాలీల సేవలను అవసరమైన కేంద్రాలలో వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీఎస్ఓ చంద్రప్రకాశ్, సివిల్ సప్లైస్ డీఎం జగదీశ్, డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 

Similar News