కార్పొరేటర్లను వెంటాడుతోన్న దళిత బంధు వసూళ్లు.. డబ్బు తిరిగివ్వాలని బాధితుల ఆందోళన

వైద్యుల కాలానికి పేరుగాంచిన ఖలీల్ వాడి కార్పొరేటర్ భర్తను దళితులు దళిత బంధు కోసం వసూలు చేసిన డబ్బు తిరిగివ్వాలని నిలదీశారు.

Update: 2024-04-29 06:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వైద్యుల కాలానికి పేరుగాంచిన ఖలీల్ వాడి కార్పొరేటర్ భర్తను దళితులు దళిత బంధు కోసం వసూలు చేసిన డబ్బు తిరిగివ్వాలని నిలదీశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దాదాపు 20 మంది దళితులు తాము దళిత బంధు కోసం ఇచ్చిన డబ్బును వాపస్ ఇవ్వాలని అతను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు నిలదీశారు. మొన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు పార్టీలో ఉన్న సదరు కార్పొరేటర్, భర్త బీజేపీలో చేరిన తర్వాత మాట మార్చడంతో కార్పొరేటర్ ఇంటి వద్ద దళితులు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరికి తనకు కొంత గడువు ఇవ్వాలని పూర్తి డబ్బు వెనక్కి ఇస్తానని, చెక్‌లు గ్యారంటీ‌గా ఇస్తానంటూ బ్రతిమాలడంతో బాధితులు వెనక్కితగ్గారు. ప్రస్తుతం ఈ ఘటన దళిత బంధు వసూలు చేసిన నాయకుల‌కు ఇబ్బందిగా మారింది.

గత ప్రభుత్వంలో దళిత బంధు ఇప్పిస్తామని దళితుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు బాధితులు చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో గత కొన్ని రోజులుగా తాము ఇచ్చిన డబ్బు కోసం నాయకుల చుట్టూ తిరిగిన బాధితులు వారిని నిలదీస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో దళిత బంధు ఇప్పిస్తామని అప్పటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు రూ.కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి అర్బన్ ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఒక్కొక్క యూనిట్‌కు రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. అందుకు అనుగుణంగా దళిత బంధు జాబితాలో పేరుతో పాటు బ్యాంక్ అకౌంట్‌లో తీయించడం, దరఖాస్తుదారుల సర్వేలో అధికారుల చేత చెప్పించడం లాంటి పనులు చేశారు.

దీంతో తమకు దళిత బంధు వస్తుందని దళితులు రూ.లక్షలు కార్పొరేటర్ల చేతిలో పోశారు. నిజామాబాద్ అర్బన్‌లో ఓ ప్రజాప్రతినిధి తమ్ముడు, ప్రజాప్రతినిధి భర్త సూత్రధారులుగా రూ.కోట్లు వసూలు చేశారు. తీరా, ప్రభుత్వం రాకపోవడంతో, ప్రజాప్రతినిధి ఓడిపోవడంతో దళితులు తాము ఇచ్చిన డబ్బు వాపసు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కొందరు దళిత బంధు డబ్బును ఎగవేసేందుకు కాంగ్రెస్, బీజేపీలోకి మారిపోయారు. అయినప్పటికీ దళితులు తాము ఇచ్చిన డబ్బుల వసూళ్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో జరిగిన ఈ తతంగంలో కొందరిని కాంగ్రెస్ లేదా బీజేపీలోకి చేర్చుకునేందుకు స్థానిక నాయకత్వం అడ్డుకోవడానికి దళిత బంధు వసూళ్లు కారణమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Similar News