పార్లమెంట్ లో ప్రశ్నించేందుకు ఎంపీగా మీ గొంతుకనవుతా

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు తనకు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంట్ లో ప్రశ్నించేందుకు మీ గొంతుకనవుతానని జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు.

Update: 2024-05-04 15:21 GMT

దిశ, బాన్సువాడ : జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు తనకు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంట్ లో ప్రశ్నించేందుకు మీ గొంతుకనవుతానని జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో గల నస్రుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాలతో పాటు బాన్సువాడ పట్టణంలో శనివారం కార్నర్ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల కలను సుసాధ్యం చేశారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేండ్లు పని చేసి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలను ఇచ్చి, అబద్దాలు చెప్పి అధికారంలోనికి వచ్చారని అన్నారు.

    బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రాంతానికి దొరకడం మీ అందరి అదృష్టమని అన్నారు. పోచారం మాదిరిగానే తనను ఓటేసి గెలిపిస్తే పోచారం అడుగుజాడలలో నడిచి, తాను కూడా పనిచేసి జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. అనంతరం బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి అధికారంలోనికి వచ్చారన్నారు. రైతులకు రుణమాఫీ చేయమంటే దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్, సొసైటీ చైర్మన్ కొల్లి గాంధీ, రైతు బంధు అధ్యక్షులు అవారి గంగారాం, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు శశికాంత్, పట్టణ అధ్యక్షుడు దుంపల రాజు, ప్రధాన కార్యదర్శి కోరిమె రఘు, తదితరులు పాల్గొన్నారు. 

Similar News