నడిపించే నాయకుడేడి..? నామ్ కే వాస్తేగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

‘మాదేముందే.. అంతా పార్టీ అభ్యర్థికి తెలుసు.. ఇంచార్జి ఎవరో వాళ్లకు తెలుసు.. ఏదో మేము పార్టీ చెప్పింది కాబట్టి వస్తున్నాం.. వెళ్తున్నాం’.

Update: 2024-04-29 02:27 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: ‘మాదేముందే.. అంతా పార్టీ అభ్యర్థికి తెలుసు.. ఇంచార్జి ఎవరో వాళ్లకు తెలుసు.. ఏదో మేము పార్టీ చెప్పింది కాబట్టి వస్తున్నాం.. వెళ్తున్నాం’. అని నిట్టూర్పుతో ఓ ప్రధాన నాయకుడు వలిగొండ మండలంలోని ఓ కార్యకర్తతో సంభాషించాడంటే అభ్యర్థి గెలుపు కోసం, పార్టీ పరువు నిలబెట్టడం కోసం ఎంత చిత్తశుద్ధితో ప్రధాన నేతలంతా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

వచ్చామా.. వెళ్లామా..

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ నుంచి ఒక ఇంచార్జీలను నియమిస్తుంటారు. ఆ క్రమంలోనే భువనగిరి పార్లమెంటు కూడా ఓ ఇంచార్జీని నియమించారు. ఆయన నియోజకవర్గంలో అందరిని సమన్వయం చేస్తూ ప్రచారం కొనసాగించాలి. అప్పటికి ఆ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ ఇంచార్జీలుఎన్నికల ప్రచారంలో ప్రధాన భూమిక పోషించాలి. కానీ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం ప్రధాన భూమిక పోషించే నేతలంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఒకవేళ ప్రచారనానికి వచ్చినప్పటికీ ‘వచ్చామా.. వెళ్ళామా’ అనే పద్ధతి తప్ప మొత్తం కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని నడిపించేందుకు ఏ నాయకుడు కూడా ముందుకు రావట్లేదు. భువనగిరి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ రోడ్ షో‌కి వచ్చి, మళ్లీ ఆదివారం వలిగొండ మండలంలో ఇంటర్నల్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఆలేరులో కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలందరూ ప్రధానంగా సభలు సమావేశాలు ఉంటే తప్ప ఎన్నికల ప్రచారంలో తమ పాత్ర నిర్వహించడం లేదని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. దానికి తోడు అభ్యర్థి ఈ జిల్లాకు కొత్త వ్యక్తి కావడం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎవరిని సంప్రదించాలి? ఎవరిని ముందు పెట్టి పార్టీని నడపాలి అనే మీమాంసలో ఉండి ఇబ్బంది పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి వాళ్లందర్నీ సమన్వయం చేస్తూ నడిపించాల్సిన నేత ఈ పార్లమెంటు పరిధిలో కరువయ్యాడని విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నప్పటికీ ఆయన మాటలు కూడా నేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తూతూమంత్రంగా ప్రచారం..

భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నామ్ కే వాస్తేగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నాయకత్వం ఎవరు కూడా ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని స్వయంగా కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వలిగొండ మండలంలో ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక సమావేశం ఏర్పాటు చేయగా అందులో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ఇతర కొంతమంది గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. అవి కూడా 10 నుంచి 15 మంది కార్యకర్తలతో ఇంటర్నల్ సమావేశాలు నిర్వహించారు. ముగ్గురు ప్రధాన నేతలు వచ్చి కూడా కార్యకర్తలను ఉత్తేజపరిచి ముందుకు నడిపించేలా సూచనలు సలహాలతో పాటు పార్టీ కోసం పని చేయాల్సిన తీరుపై ఎవరు మాట్లాడకపోవడం పట్ల కార్యకర్తలు కొంత అసహనంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇది కేవలం కార్యకర్తలను కలిశామని చెప్పుకోవడానికి అక్కడికి వచ్చే సమావేశాలు తప్ప మరొకటి కాదని స్వయంగా కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. ఈ సమావేశాలను గమనిస్తే కార్యకర్తలకు ఉత్సాహం సంగతి దేవుడెరుగు.. ఓటు కూడా వేసే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చిన నేతలు 10 నిమిషాల్లో సమావేశం ముగించడం పక్కన ఉన్న కార్యకర్తలతో ఫొటోలకు స్టిల్స్ ఇవ్వడం తిరిగి వెళ్లిపోవడం ఇవి ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్న తీరు. ఇలాంటి పరిస్థితులలో పార్టీ పరువు దక్కేలా ఓట్లు దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.

Similar News