నకిలీ పత్తి విత్తనాల నిందితుల రిమాండ్

మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.

Update: 2024-05-27 08:59 GMT

దిశ ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పట్టణం లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 25న పట్టణంలోని ఈదులగూడ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించిన నిందితులు పత్తి విత్తనాల సంచులను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో అనుమానం వచ్చి సంబందిత వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలు అని గుర్తించి ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా పట్టణం లోని రైల్వే స్టేషన్ లో గండవల్లి శ్రీ రంగా ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో నకిలీ విత్తనాలతో ఉన్న నిందితులు గుడుగుంట్ల వీర మాణిక్యం, కోటా సాంబశివరావు,ముండ్రు మల్లిఖార్జున్ లను వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆయన తెలిపారు.ఈ కేసులో మరో నిందితుడైన పెండ్యాల జగదీశ్వర రావు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు .కేసును ఛేదించిన పట్టణ వన్ టౌన్ సి.ఐ సుధాకర్ ఎస్ ఐ రవికుమార్ , కానిస్టేబుల్ లు హూస్సేన్ ,వెంకటేశ్వర్లు ,నాగరాజులకు ఎస్పీ చందన దీప్తీ రివార్డు ప్రకటించినట్లు తెలిపారు.

Similar News