ఏపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట సామాగ్రి మాయం

అదొక ప్రభుత్వ పాఠశాల ఊరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది

Update: 2024-05-24 10:33 GMT

దిశ, చిట్యాల: అదొక ప్రభుత్వ పాఠశాల ఊరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాఠశాల దూరంగా ఉండడాన్ని గమనించిన అగంతకులు పాఠశాలలో ఉన్నటువంటి వంటి సామగ్రిని దొంగిలించి పట్టుకెళ్లారు... పూర్తి వివరాల్లోకెళ్తే చిట్యాల మండలం ఏపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊరికి చివర ఉండడంతో పాటు పాఠశాలకు చుట్టూ సరైన ప్రహరీ గోడ లేకపోవడం, వాచ్మెన్ ఉండకపోవడంతో గమనించిన దొంగలు పాఠశాల గేటుకు ఉన్న తాళాలు పగటగొట్టి వంట సామగ్రిని దొంగిలించారు.

శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింత సుధాకర్ రెడ్డి పాఠశాలలో పుస్తకాలను భద్రపరిచేందుకు వచ్చి చూసేసరికి గేటు తాళాన్ని పగలగొట్టడంతో పాటు లోపల ఉన్న వంట సామాగ్రిని భద్రపరిచిన రూమ్ తాళం కూడా పగలగొట్టి ఉండడంతో ఆందోళనతో ఆయన లోపలికి వెళ్లి చూడగా వంట సామాగ్రి కనిపించలేదు. దాంతోపాటు నాలుగు ఖాళీ బీరు సీసాలు పడి ఉన్నాయి. వెంటనే ఆయన గ్రామపంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో కార్యదర్శి వచ్చి పంచనామ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..

పాఠశాలకు వాచ్మెన్ లేకపోవడమే కారణం:

ఊరికి చివరి నిర్మానుష్య ప్రాంతంలో పాఠశాల ఉండడం, దానికి సరైన ప్రహరి గోడలు, సెక్యూరిటీ లేకపోవడంతో అగంతకులు గత కొద్దిరోజులుగా పరిశీలించి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బందిని వాచ్ మెన్ గా నియమించి నప్పటికీ పాఠశాలకు సెలవులు కావడంతో పాఠశాల వైపుకు ఎవరు కూడా వెళ్లి పోయే సరికి ఈ సంఘటన జరిగింది. మండలంలో ఇంకా చాలా ప్రభుత్వ పాఠశాలలో ప్రహరి గోడలు, వాచ్మెన్ లేకుండా ఉన్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాలలో టీవీలు, ప్రొజెక్టర్లు వంటి విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు రాత్రి సమయంలో కాపులాగా ఉండే వాచ్మెన్ లను నియమించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Similar News