హమాలీల పేరుతో అరకోటి వసూలు

అక్కడ అధికారి చెప్పింది వేదం....ఎంత అంటే అంత ముట్ట చెప్పాల్సిందే....

Update: 2024-05-23 10:15 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : అక్కడ అధికారి చెప్పింది వేదం....ఎంత అంటే అంత ముట్ట చెప్పాల్సిందే.... లేదంటే పని కాదు.. పనిచేసే వాళ్లు ఇంటికి వెళ్లాల్సిందే.... ఓ అధికారిగా ఉండి కింది స్థాయిలో పనిచేసే వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడం, లక్షల్లో వసూలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి... ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బేవరేజ్ కార్పొరేషన్ అధికారి తీరు.. పూర్తి వివరాల్లోకి వెళితే సుమారు 2021-- 22 సంవత్సరంలో జిల్లా కేంద్రంలో ఉన్న బేవరేజ్ కార్పొరేషన్ లో గతంలో పనిచేస్తున్న

    వాళ్లు ఉన్నప్పటికీ కొత్తగా ఇంకా హమాలీలు అవసరమనే నేపంతో కొంతమందిని తీసుకున్నారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు రోజూ రూ.3 నుంచి 5 వేలు వస్తుందని వినికిడి. ఇది ఇలా ఉంటే అక్కడ పని చేస్తున్న కార్మికులకు పని ఒత్తిడి అవుతుందనే కారణం చూపి నూతనంగా మరో 51 మందిని పనిలోకి తీసుకోవాలని నాటి బేవరేజ్ కార్పొరేషన్ డీఎం, కార్మికులు కలిసి నిర్ణయించారు. అయితే రోజుకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే ఈ కార్పొరేషన్ లో పనిచేయడానికి ఎవరైనా ఇష్టపడడం సహజం. కార్మికులను నూతనంగా తీసుకుంటున్నామని తెలియగానే చాలామంది ముందుకు వచ్చారు. పని చేయడానికి ఎక్కువమంది రావడంతో ఇదే అదునుగా అధికారి భావించినట్లు సమాచారం. దాంతో ఒక్కొక్క కార్మికుడి

    నుంచి సుమారు రూ.40 నుంచి రూ.45 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హమాలీల నుంచి రూ.20 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా వసూలు చేసిన డబ్బులు నాడు జిల్లా కేంద్రంలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి కొంతమంది లీడర్లకు ముట్టినట్లు తెలిసింది. అయితే ఈ అక్రమ దందా ఆ నోట ఈ నోట చర్చ జరిగి బేవరేజ్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలిసిన నాటి రాష్ట్ర అధికారులు అప్పుడున్న డీఎం ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఆయన తర్వాత ఆ స్థానంలో మరో అధికారి సుమారు మూడేళ్ల క్రితం బేవరేజ్ కార్పొరేషన్ లో చేరిపోయాడు. గతంలో పనిచేసిన అధికారి సస్పెండ్ కావడానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకున్నాడు. అనంతరం మీ అందరిని తొలగించాల్సిందేనని,

    ఒకవేళ మీరు కొనసాగాలంటే తనకు కొంత సొమ్మును ముట్టు చెప్పాలని డిమాండ్​ చేశాడు. దాంతో హమాలీలు ఆందోళనకు గురై అందరూ కలిసి సుమారుగా రూ.50 లక్షలు అధికారికి ముట్ట చెప్పినట్లు సమాచారం. దాంతో హమాలీల విషయాన్ని మరుగున పడేసి తాను దోచుకోవడం... దాచుకోవడమే లక్ష్యంగా ఆ అధికారి పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం బేవరేజ్ కార్పొరేషన్ అక్రమ వసూళ్లకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హమాలీ కార్మికులు, బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బంది, మద్యం వ్యాపారుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు వినిపిస్తోంది.  

Similar News