ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-05-23 08:15 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం, రుద్రవెల్లి గ్రామాలలో ఐకేపీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 45 రోజులుగా ఐకేపీ కేంద్రానికి ధాన్యం వస్తున్న కూడా కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశలో కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని, అయినా కొనుగోలు సరిగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారినట్లు ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు వేస్తే బొనస్ ఇవ్వము అంటున్నారని చెప్పారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. దేవుడి మీద ఒట్టు పెడితే రైతులకు న్యాయం జరగదని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉందన్నారు‌. రైతులను బీఆర్ఎస్ మోసం చేసిందని, అదే దారిలో కాంగ్రెస్ నడుస్తుందన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.‌ సన్న రకం పేరు మీద.. దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ సహించదన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రైతుల్లో వ్యతిరేకతను కూడగట్టుకోవడానికి బీఆర్ఎస్ కు 10 ఏళ్లు పడితే... కాంగ్రెస్ కు 5 నెలలే పట్టిందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఆయనతో పాటు బూర నర్సయ్య గౌడ్, పాశం భాస్కర్, పడమటి జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News