బెల్టు షాపులు ఇంకా మూతబడలే..! ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా యథేచ్ఛగా విక్రయాలు

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో అధికారికంగా ఏడు మద్యం దుకాణాలు ఉంటే అనధికారికంగా 30 వరకు బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి.

Update: 2024-04-29 02:38 GMT

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో అధికారికంగా ఏడు మద్యం దుకాణాలు ఉంటే అనధికారికంగా 30 వరకు బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. బెల్టు దుకాణాలకు మద్యం దుకాణదారులు డోర్ డెలివరీ చేస్తూ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా రామన్నపేట మండలంలో ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాల్లో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఇక్కడ రాత్రి సమయాల్లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నార్కట్‌పల్లి మండల పరిధిలోని గ్రామాలను ఎక్సైజ్ అధికారులు దుకాణాలకు పంపకాలు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా గ్రామాలకు పంపిణీ చేశారు. అధికారులు పంపకాలు చేసిన తీరుగానే కొనుగోలు చేయాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు.

దిశ, నకిరేకల్: పైన ఉదాహరణలు చూస్తే గ్రామాల్లో బెల్టు దుకాణాల జోరు ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇది నకిరేకల్ నియోజకవర్గంలో మాత్రమే కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగానే కొనసాగుతోంది. దీనంతటికీ కారణం అధికార యంత్రాంగం పట్టింపు లేనితనంగా చెప్పొచ్చు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం అమ్మకాలను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారుల అండ ఉండడంతో ప్రతి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో మధ్య తరగతి కుటుంబాలు బానిసలై చిత్తవుతున్నారు.

అంత వారి కనుసన్నల్లోనే... 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ బెల్ట్ దుకాణాల బాగోతం అంతా అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలి. కానీ ఉమ్మడి జిల్లాలో 15 వేల పైచిలుకు దుకాణాలు ఉన్నాయంటే అధికారుల సహకారం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అధికారులే బెల్టు దుకాణదారులను ప్రోత్సహిస్తూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా అండగా ఉంటున్నారు. పైనుంచి ఉన్నతాధికారులు వస్తే ముందుగానే మద్యం దుకాణదారులకు సమాచారం అందజేస్తున్నారు. అడపాదప కావాల్సిన సమయంలో మాత్రమే చిన్నపాటి కేసులతో తూతూ మంత్రంగా గడిపేస్తున్నారు.

ప్రతి దుకాణం నుంచి 30 వేల వరకు మామూళ్లు..

ప్రతి మద్యం దుకాణం నుంచి నెల నెలా అధికారులకు రూ.30 వేల వరకు మామూలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్సైజ్ అధికారులకు 16 వేలు, పోలీస్ అధికారులకు 15 వేల చొప్పున చెల్లిస్తున్నామని దుకాణ యజమానులే స్వయంగా వెల్లడిస్తున్నారు. ప్రతినెల పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు, ఎక్సైజ్ స్టేషన్ నుంచి ఒకరు వచ్చి మామూలు తీసుకెళ్తారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఎన్ని బెల్ట్ దుకాణాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో 155, సూర్యాపేటలో 99, యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 ఇలా మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 336 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇలా ప్రతి మద్యం దుకాణం నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మామూలు ఇవ్వకపోతే బెల్టు దుకాణాలు నడవకుండా కేసులు చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తారని ఓ దుకాణదారుడు ‘దిశ’తో వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేక డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నందున బెల్టు దుకాణాలను ఎంత మేర అరికడుతున్నారో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిందే.

Similar News