30 ఏళ్ల కిందటి చెరువు ధ్వంసం.. గగ్గోలు పెడుతున్న రైతులు

మండలంలోని తానేదార్ పల్లి గ్రామపంచాయతీలో పోసిగుండ్ల -చెవిటి కొండ గుట్టల మధ్య ఒక భూస్వామి భూమిలో 656 సర్వేనెంబర్ లో నైజాం ప్రభుత్వంలో ఈ చెరువు నిర్మాణం జరిగింది.

Update: 2024-05-08 08:11 GMT

దిశ, మర్రిగూడ : మండలంలోని తానేదార్ పల్లి గ్రామపంచాయతీలో పోసిగుండ్ల -చెవిటి కొండ గుట్టల మధ్య ఒక భూస్వామి భూమిలో 656 సర్వేనెంబర్ లో నైజాం ప్రభుత్వంలో ఈ చెరువు నిర్మాణం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో 30 సంవత్సరాల కిందట లక్షలాది రూపాయలతో ఊటచేరువును నిర్మించారు. అదే భూస్వామి ప్రస్తుతం భూములు పంచుకోవాలి అంటూ రెండు రోజుల నుండి దగ్గరుండి ధ్వంసం చేశారని చుట్టుపక్కల రైతులు గగ్గోలు పెడుతున్నారు.1994లో సుమారు లక్షలాది రూపాయలతో ఈ ఊటకుంట( చెరువు)ను ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేశారు. ఈ చెరువు వలన నాటి నుంచి నేటి వరకు దాని చుట్టుపక్కల ఉన్న సుమారు 150 ఎకరాల రైతులకు సేద్యం చేసుకోవడానికి ఉపయోగపడేది. 1994లో అప్పటి జడ్పిటిసి ముద్దం జంగయ్య ఆధ్వర్యంలో ఆ కుంట నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఆ కుంటను పెద్దపెద్ద హిటాచీలతో కట్టను ధ్వంసం చేసి రిపీట్ మెంట్ రాళ్లను గోతులు తీసి అందులో వేసి పూడ్చి వేస్తున్నారు. ఈ ఊట కుంటను ధ్వంసం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో కీలక సభ్యులుగా ఉండటం వలన అతన్ని ఎదిరించడానికి రైతులు సాహసం చేయడం లేదు. లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనంతో రైతుల సంక్షేమం కోసం నిర్మాణం చేపట్టిన ఊట కుంటను గత రెండు రోజులుగా దగ్గరుండి ధ్వంసం చేయడంతో ఆ ఊట కుంట పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోతుంది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని రైతుల బాగు కోసం తిరిగి పునర్నిర్మించాలని రైతుల కోరుతున్నారు.

Similar News