‘అడ్డొస్తే సహించే ప్రసక్తే లేదు’.. విపక్షాలకు మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్

విపక్షాల విమర్శలకు తమ పరిపాలనే సమాధానం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం లాగా తాము తప్పులు చేయమని

Update: 2024-05-26 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విపక్షాల విమర్శలకు తమ పరిపాలనే సమాధానం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం లాగా తాము తప్పులు చేయమని క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డొస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్లు పరిపాలించిన పార్టీకి సహేతుమైన సూచనలు ఇవ్వాలని గతంలోనే కోరామని, కానీ వాళ్లు ఆ దిశగా చొరవ చూపలేదన్నారు. అన్ని పక్షాల సహకారాన్ని తీసుకొని కాంగ్రెస్ ముందుకు పోతుందన్నారు. అబద్ధాల విమర్శలను జనం పట్టించుకోరన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

అబద్దాలను ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. గత ప్రభుత్వ పొరపాట్లను తాము చేయమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ పక్కతోవ పట్టిస్తున్నారన్నారు. మరోవైపు గత సంవత్సరం ఏంజీఏం హాస్పిటల్‌లో 121 సార్లు కరెంట్ బ్రేక్ డౌన్ అయిందన్నారు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కరెంట్ ఇబ్బంది వస్తుందని మౌనంగా ఉండిపోయామని గుర్తు చేశారు. వారం రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో జనరేటర్‌ సమస్య వల్ల విద్యుత్ నిలిచిపోయిందని మంత్రి సమాధానం ఇచ్చారు. పైగా ఎలుకలు పేషెంట్‌ను తిన్నాయన్నారు. కానీ తాము అప్పటి ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీదెయ్యలేదన్నారు. రాష్ట్రంలో వంద రోజుల పాలన కాక ముందే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, అయినప్పటికీ మెజార్టీ హామీలను అమలు చేశామన్నారు. మేడిగడ్డకు రావాలని ప్రతిపక్ష పార్టీని కోరినా, ముందుకు రాలేదన్నారు

పరిశ్రమలు ఎక్కడికీ వెళ్లలే..

రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక రూ.49 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. కెమ్స్ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లలేదన్నారు. కార్నింగ్ సంస్థ మన రాష్ట్రంతో బైండింగ్ చేసుకోలేదన్నారు. కార్నింగ్ సంస్థను మన రాష్ట్రంకు రావాలని కోరుతున్నామన్నారు. కార్నింగ్ పోతే వాళ్ళ అబ్బా లాంటి సంస్థను తెలంగాణకు తీసుకు వస్తామన్నారు. 2016 నుండి ఇప్పటి వరకు పరిశ్రమలకు దాదాపు రూ.3 వేల కోట్ల సబ్సిడీలను ఇవ్వని చరిత్ర బీఆర్ఎస్‌ది అన్నారు. మరోవైపు రాష్ట్రంలో రెండు మూడు గంటలు కరెంట్ ఎక్కడా పోవడం లేదన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బెదిరించి మన రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నా, అంతకంటే ఎక్కువే తీసుకువస్తామన్నారు.

మరక అంటిస్తే తుడిచేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వంపై మరక అంటిస్తే తుడిచేస్తామని, సూర్యాపేట సభలో విద్యుత్‌ పోతే ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపణలు చేసిందని మంత్రి శ్రీధర్‌ బాబు మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫీడర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యలు వస్తాయన్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. కానీ తమ ప్రభుత్వంలో 30 నిమిషాల్లోనే అధికారులు విద్యుత్‌ సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ రంగంలో కొత్తగా ఏమీ చేయలేదని బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న విద్యుత్‌ వ్యవస్థనే కొనసాగిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్​కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News