కాంగ్రెస్‌ను టచ్ చేస్తే తోడ్కలు తీస్తాం.. మంత్రి పొన్నం తీవ్ర హెచ్చరిక

రాష్ట్రంలో గొల్ల కురుమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Update: 2024-04-29 15:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గొల్ల కురుమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కురుమ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీజేపీ, బీసీలకు వ్యతిరేక పార్టీ అని, రిజర్వేషన్లు ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే, బీసీలు ఆగమవుతారన్నారు. అందుకే ఉత్తర భారత దేశం గ్రహించి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. దేశ ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ హామీ ఇచ్చిందన్నారు. కానీ బీజేపీ రాముడిని నమ్ముకొని రాజకీయం చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను టచ్ చేస్తే, తొడ్కలు తీస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..కొల్లూరు మల్లప్ప ఫొటోను గాంధీ భవన్లో పెట్టడం సంతోషమన్నారు. హెచ్ పీసీసీ గా కొల్లూరు మల్లప్ప పనిచేశారని గుర్తు చేశారు. కేసీఆర్, మోడీ గొల్ల కురుమలను మోసం చేశారన్నారు. గొర్లు, బర్లు అంటూ నిట్టనిలువునా ముంచేశారన్నారు. 17 సీట్లల్లో కాంగ్రెస్ గెలుపు కోసం గొల్లకురుమలు పనిచేయాలన్నారు. మోడీ బీసీ అని చెప్పుకొని, బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తి వేస్తున్నాడన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గొల్ల కురుమలకు నాలుగు సీట్లు ఇచ్చిందని, మోడీ, కేడీలు ఇద్దరూ ఒకటై మోసం చేస్తున్నారన్నారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.

ఎమ్మెల్సీ మహేష్​కుమార్ గౌడ్ మాట్లాడుతూ...బీసీలకు ఎక్కువ సీట్లు రావాల్సిన ఉన్నా, కొన్ని సమీకరణాల దృష్ట్యా పార్టీ ఇవ్వలేకపోయిందన్నారు. అయినప్పటికీ, భవిష్యత్ లో బీసీలకు పెద్ద పీఠ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదన్నారు. కురుమలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయన్నారు. గద్వాల లో సరితకు పార్టీ అవకాశం ఇచ్చినా, అక్కడ కొన్ని కారణాల వల్ల ఓటమిపాలయ్యిందన్నారు. సరితా గెలిస్తే కురుమలకు మరింత బలం అయ్యేదన్నారు. బీర్ల ఐలయ్య గెలిచి కురుమలకు ప్రతినిధిగా నిలిచిండన్నారు. కురుమ కులానికో చెందిన కొల్లూరు మల్లప్ప,మొట్టమొదటి హైదరాబాద్ స్టేట్ కు పీసీసీ చీఫ్ గా పనిచేశారని గుర్తు చేశారు.

ఐలయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసి కురుమలకు పార్టీలో, ప్రభుత్వంలో మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తామన్నారు. ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లాడుతూ..కాంగ్రెస్ బీసీలకు పెద్దపీఠ వేసిందన్నారు. యాదవ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సభ్యుడిగా పంపించిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు. ఎన్ ఎస్ యూఐ స్టేట్ బాడీలో కురుమ యువకులు ఎక్కువ మంది ఉన్నారని గుర్తుచేశారు. గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ..కురుమల్లో ఐక్యత లోపించిందని, అందరం కలసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. తన ఓటమీలో కుట్రలు ఉన్నాయన్నారు. గద్వాల బంగ్లాను ఎదిరించడానికి సీఎం రేవంత్ తనను నిలపెట్టారని, కానీ తనకు ఓట్లు రాలేదన్నారు.

టీపీసీసీ సీనియర్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీసీ జనగణన జరగాలని రాహుల్ గాంధీ చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాగానే మనకు మంచి రోజులు వచ్చినట్లేనని వివరించారు. కురుమలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయకత్వం లో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని బీసీ కులాలు కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలన్నారు.

Similar News