ఎలివేటెడ్ కారిడార్‌కు మోక్షం ఎప్పుడు..?

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు సుమారు రూ.670 కోట్లతో నిర్మిస్తున్న

Update: 2024-05-27 13:01 GMT

దిశ, ఉప్పల్: ఉప్పల్ నుంచి నారపల్లి వరకు సుమారు రూ.670 కోట్లతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ఐదేళ్లు గడుస్తున్న ఇంకా పూర్తి కాకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉప్పల్ కారిడార్ నిర్మాణ పనుల వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార సముదాయ యజమానులు దుమ్ముతో నరకయాతన అనుభవిస్తున్నారు.గుంతలలో వర్షం నీళ్లు నిండిన రోడ్లు గుంతలు పడిన రహదారులతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.రెండేళ్లలో పూర్తి కావాల్సిన కారిడార్ పనులు ఇదేళ్లుగా నత్తనడకన నడుస్తున్నందున ఉప్పల్ నుండి వరంగలకు వెళ్లే వాహనాదారులు నారపల్లికి వెళ్లేసరికి నరకం చూస్తున్నారు.అరకిలో మీటర్ దాటాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు 6.2 మీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ పనులు 2018 లో ప్రారంభించారు.2020 వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు పనులు మాత్రం నత్త నడకన నడుస్తున్నాయని ప్రజలు, వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐదేండ్లుగా కొనసాగుతున్న పనులు..

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఐదేళ్లలో పిల్లర్లు మాత్రమే పూర్తి చేశారు.పిల్లర్ల పై స్లాబ్ లు ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.పిల్లర్ల ఏర్పాటు కోసం రోడ్డు ను ఎక్కడికక్కడ తవ్విడంతో రోడ్డు పరిస్థితి గుంతలతో అధ్వానంగా మారింది.వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తరుచు ట్రాఫిక్ జామ్ ..

ఉప్పల్ -వరంగల్ మార్గం చాలా కీలకం.వరంగల్,యాదాద్రి,జనగాం నుంచి ఉప్పల్ కి వచ్చి వెళ్లే వాహనాలు రోజుకు సుమారు 80 వేల వాహనాలు ఈ మార్గంలో నడుస్తుంటాయి. ప్రతి నెలలో ఒకరో ఇద్దరో వీఐపీలు యాదాద్రి టెంపుల్ కు వెళ్తుంటారు.ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ మరింతగా పెరిగిపోతుంది. వర్షాలు పడితే చెప్పనవసరం లేదు రోడ్లన్నీ చెరువులుగా మారిపోతాయి గుంతలలో నీళ్లు నిండిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది.ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్డు,నల్ల చెరువు కట్ట, కట్ట మైసమ్మ టెంపుల్, పీర్జాదిగూడా కామన్,చెంగిచెర్ల చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో అయితే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వరకు వెళ్లాలంటే గంటల సమయం పడుతుందని వాహనదారులు మొర పెట్టుకుంటున్నారు.

అరకోర రోడ్డు..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వేసి వేయనట్టు అరకొర రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు.వేసిన రోడ్డు కూడా సరిగా లేక వాహనదారులు దుమ్ముతో,గుంతలతో నరకయాతన అనుభవిస్తున్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నరకానికి పునాది పడినట్లే : నారగోని ప్రవీణ్ కుమార్

ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి పీర్జాదిగూడ రోడ్ లో ప్రయాణిస్తే చాలు నరకానికి పునాది పడినట్లే సంవత్సరాల తరబడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతుండటం వలన మూడు వందల గుంతలతో నిండి ఉంది.అంబులెన్స్ కు కూడా అరగంట వరకు దారి దొరకకుండా ట్రాపిక్ జామ్ అవుతుంది.ద్విచక్ర వాహనదారులకు చాలా ప్రమాదకరంగా వుంది కిందపడి కాళ్లు చేతులు విరగ గొట్టుకుంటున్నారు. ఈ రోడ్ లో ప్రయాణిస్తే నడుము నొప్పులు రావడం మాత్రం పక్కా.కార్లు ఇతర వాహనాలు ఈ రోడ్డు మీద రెండు సార్లు ప్రయాణిస్తే వీల్ అలైన్మెంట్ చేసుకోవాల్సిందే,నాలుగు సార్లు ప్రయాణిస్తే బ్రేక్ లైనర్ మార్చుకోవాల్సిందే.నిర్లక్ష్యం అధికారులదో ప్రభుత్వాలదో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఈ ప్రాంత రాజకీయ నాయకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది.కనీసం గుంతలు పూడ్చే కార్యక్రమం అయినా చేపట్టడం లేదు ఇక్కడి రాజకీయ నాయకుల పనితీరుకు నిదర్శనం ఉప్పల్ పీర్జాదిగూడ రోడ్ వాన పడితే చాలు నీటితో గుంతలు నిండుతాయి.ట్రాఫిక్ గంటల తరబడి జామ్ అవుతుంది. ప్రభుత్వాలు మారుతున్నా పనితీరు మారడం లేదు.

Similar News