అబద్ధపు హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తోంది : ఈటల

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలను కురిపిస్తూ ఓట్లను

Update: 2024-05-02 10:17 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలను కురిపిస్తూ ఓట్లను దండుకోవాలని చూస్తోందని మల్కాజిగిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బోడుప్పల్, చెర్లపల్లి లో రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రిపురం క్రాస్ రోడ్స్ వద్ద ఎస్టీ మోర్చా మీటింగ్ లో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్ కూటమి అసత్యప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కానీ బీజేపీ అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ చేస్తున్న కేటగిరీల పోరాటంలో కూడా నరేంద్ర మోదీ తమ మద్దతు తెలియజేశారని, దీనిని బట్టి బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని అర్థమవుతుందన్నారు.

మోడీ ప్రధాని అయిన తర్వాత అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని దళితులకు ఇచ్చారని , ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదిముర్మును రాష్ట్రపతిని చేశారని వివరించారు. అప్పట్లో విపక్షాలు దేశం విచ్ఛిన్నమవుతుందని, అల్లకల్లోల మవుతుంది, అధోగతి పాలవుతుందని ఆరోపణలు చేసేవన్నారు. కానీ ఈ పదేళ్ల కాలంలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసన్నారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రపథకాలను కూడా తమ పథకాలుగా ప్రకటించుకుంటూ ప్రజలను మభ్య పెట్టడం వల్ల మోదీ తెలంగాణకు ఏమి చేశారో తెలియకుండా పోయిందన్నారు. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని 4 కోట్ల ఇళ్లను ప్రధాని కట్టించారని, పల్లెటూర్లలో మహిళలకు టాయిలెట్లు లేకపోతే, స్వచ్ఛభారత్ పథకం కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు కట్టించారని ఈటల పేర్కొన్నారు

అనంతరం మల్కాజ్ గిరి మెకానిక్స్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఈటల పాల్గొని మాట్లాడారు. మెకానిక్ షాపు వద్ద కస్టమర్లు వస్తూనే ఉంటారు. వారు వారి స్కూటర్ రిపేర్ అయినంత వరకు వేచి ఉంటారు. మీ కుటుంబాలు, కస్టమర్లు అందరు బీజేపీకి ఓటు వేసేలా వారిని ప్రభావితం చేయాలని ఈటల విజ్ఠప్తి చేశారు.ఉద్యోగాలు లేక కొందరు పట్టభద్రులు కూడా ఇలా మన కాళ్ల మీద మనం నిలబడి మెకానిక్ పని చేసుకుని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. 200 కోట్ల పెట్టుబడి పెడితే మేజర్ ఇండస్ట్రీ అవుతుంది. ఈ కంపెనీలు రూ.400 కోట్ల రాయితీ అడుగుతుంది. వారికి కరెంటులో, భూమిలో, టాక్స్‌లలో రాయితీలు ఇస్తున్నారు. కానీ తమ కాళ్లపై నిలబడే మెకానిక్‌లకు ఎందుకు రాయితీలు ఇవ్వరని ప్రశ్నించారు.నేడు రాష్ట్రం మొత్తం మీద 10 వేల మంది ఉన్నారు.

మీరందరూ అడిగేది న్యాయమైన కోరిక. మీకు కూడా ఒక అడ్డా కావాలి, షాపులు కట్టి, కిరాయి లేకుండా, కరెంటు సబ్సిడీ ఇస్తే చాలు. ప్రభుత్వం కాస్త సహాయం చేస్తే మీకుటుంబాలు బాగుపడతాయి. మీ పిల్లలను చదివించుకోగలుగుతారు. ఎవరెవరికో రాయితీలు, ప్రభుత్వ భూములు పంచిపెడుతున్నారు. మీలా కష్టపడి పని చేసుకునే వారికి ఎందుకివ్వరని అన్నారు. ప్రభుత్వాలు కొద్దిమంది బాగుతప్ప, శ్రామికుల బాధలు పట్టించుకోవడం లేదని, పేదలు ఎక్కడున్నా, బాధలు ఎక్కడున్నా నేను మీకు అన్నలా అండగా నిలబడి ఉంటానని మాట ఇస్తున్నానని ఈటల రాజేందర్ హామీ ఇఛ్చారు. వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయ్యాని కోరారు.

Similar News