బీజేపీ, కాంగ్రెస్ తో లాభం లేదు

పదేళ్ల కింద మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Update: 2024-05-09 12:36 GMT

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : పదేళ్ల కింద మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా యావత్ దేశం చెవిలో పువ్వులు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇది వరకు ఇచ్చిన హామీలకే గ్యారెంటీ లేదు, ఇప్పుడు చెప్పే మాటలకు ఏం గ్యారెంటీ ఉంటుందని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధర తగ్గినా మోదీ మాత్రం పెట్రోల్ ధరలు తగ్గించకుండా డబుల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి 30 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజమెత్తారు. అలా వసూలు చేసిన 30 లక్షల కోట్ల రూపాయల నుంచి 14.5 లక్షల కోట్లు అంబానీ, అదానీల రుణాలను మాఫీ చేశారని తేల్చిచెప్పారు. తన మాటలు నిజం కాదని బీజేపీ నేతలు చెబితే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపుతోందని ఫైరయ్యారు. కులం, మతం ఆధారంగా ఓటేయొద్దని కోరారు.

     కాబట్టి తెలంగాణ కోసం తెగించే కొట్లాడే బీఆర్ఎస్ కే మద్దతివ్వాలని కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఇంపీరియల్ గార్డెన్స్ లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఓ స్త్రీ రేపు రా అన్న పద్ధతిలో ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు హామీల అమలు గురించి రేవంత్ రెడ్డి నెలలు, తారీకులు చెబుతున్నారని చురకంటించారు. రేవంత్ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న ఇండస్ట్రీలు తరలిపోతున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ గుర్తుచేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న, మల్కాజి గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు.

     ఓటు వేసిన అనంతరం వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా చూసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నతో పాటు మాజీమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోక్ నాథ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, ఆకుల హరి తదితరులు పాల్గొన్నారు. 

Similar News