ఒకరు దేశాన్ని, మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు : కేటీఆర్

బడా భాయి మోడీ, చోట భాయి రేవంత్​ రెడ్డి ఒకరు దేశాన్ని,

Update: 2024-05-02 16:53 GMT

దిశ, కూకట్​పల్లి: బడా భాయి మోడీ, చోట భాయి రేవంత్​ రెడ్డి ఒకరు దేశాన్ని, మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం మూసాపేట్​లో గురువారం మల్కాజిగిరి బీఆర్​ఎస్​ ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్​ షోలో మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్​ కుమార్​లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ కేంద్రంలో బడా భాయి మోడీ, రాష్ట్రంలో చోట భాయి రేవంత్​ రెడ్డిలు కలిసి దోచుకుంటున్నరని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్​ రెడ్డి లంకే బిందెలు ఉంటాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని మాట్లాడటం విడ్డురంగా ఉందని, రాష్ట్ర పరిస్థితులు తెలుసుకోకుండానే ఎన్నికలలో హామిలు ఇచ్చారా అని ప్రశ్నించారు. లంకె బిందెల కోసం ఎవరు వస్తారో ప్రజలే తెలుసుకోవాలని అన్నారు. ఇష్టం వచ్చిన హామీలు, చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప గడిచిన నాలుగున్నర నెలలో కాంగ్రెస్​ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిందేమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తరువాత రూపయి ఇచ్చే ఒక్క పథకం ఇవ్వకపోగా రంజాన్​ సందర్భంగా ప్రభుత్వం తరఫున అందించే రంజాన్​ కానుకలు, క్రిస్మస్​ సందర్భంగా ఇచ్చే క్రిస్మస్​ కానుకలు ఇవ్వకుండా తప్పించుకున్నారని, రానున్న బతుకమ్మ పండుగ కానుకలు బతుకమ్మ చీరలు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడి తెచ్చే మాట, అభివృద్ధి చేసే మాటలు మాట్లాడిండా అంటే ఒకటి లేదని అన్నారు.

పదేండ్లుగా ఎన్నో ప్రాంతాల నుంచి రాష్ట్రానికి, నగరానికి వలస వచ్చి బతుకుతున్న వేరే ప్రాంత ప్రజలను కేసీఆర్​ కాపాడుకున్నారని అన్నారు. రాష్ట్రంలో, ప్రజలలో కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేస్తానని కంకణం కట్టుకుని రేవంత్​ రెడ్డి పని చేస్తున్నాడే కాని ప్రజల కోసం చేసింది ఏమీ లేదని అన్నారు. హైదరాబాద్​లో 16 స్థానాలలో ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు తలవంచి పాదాభి వందనం చేసుకుంటున్నానని, బీఆర్​ఎస్​ పార్టీపై, కేసీఆర్​పై ప్రజలకు ఉన్న విశ్వాసం ఉంచుకుంటామని అన్నారు. హైదరాబాద్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది, కుట్రలను అడ్డుకోవాలంటే పార్లమెంట్​లో గులాబీ దళం తమ గొంతుకను వినిపించాల్సిన అవసరం ఉంది, బీఆర్​ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్రం తరఫున పార్లమెంట్​లో పోరాడతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్​ మాజీ కార్పొరేటర్​ తూము శ్రావణ్​ కుమార్, కార్పొరేటర్​ సబీహా బేగం, ముద్దం నరసింహ యాదవ్​, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Similar News