మేకల కావ్యపై నెగ్గిన అవిశ్వాసం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల

Update: 2024-02-19 14:05 GMT

దిశ ప్రతినిధి,మేడ్చల్ /జవహర్ నగర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై అసమ్మతి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. జవహర్ నగర్ నగర పాలక సంస్థలో మేయర్ సహా 28 మంది కార్పోరేటర్లు ఉన్నారు. సోమవారం ఓటింగ్ నిర్వహించగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఓటు వేశారు.అవిశ్వాస తీర్మానంపై సమావేశానికి అసమ్మతి వర్గానికి చెందిన 20 మందికార్పొరేటర్లు ప్రత్యేక వాహనంలో హాజరయ్యారు. కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ ఓటింగ్ నిర్వహించారు. జవహర్ నగర్ కార్పొరేషన్ లోమొత్తం 28 మంది కార్పోరేటర్లు ఉండగా గతంలో అనారోగ్యంతో 16 వ డివిజన్ కార్పోరేటర్ మృతి చెందారు. దీంతో 27 ఓట్లకు గాను మేకల కావ్యకు వ్యతిరేకంగా 20 ఓట్లు పడ్డాయి. మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఓటింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జవహర్ నగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అవిశ్వాసం నెగ్గడంతో మేయర్ కావ్య కార్పోరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా, త్వరలో కొత్త మేయర్‌గా శాంతికోటేష్ గౌడ్ ను ఎన్నుకోనున్నట్లు డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హల్ చల్ చేశారు.పదుల సంఖ్యలో బౌన్సర్ల పహారలో మీడియాతో మాట్లాడారు. కొత్త మేయర్ ఎంపిక త్వరలో ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మేయర్ ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే ప్రకటనతో ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 19 మంది అసమ్మతి కార్పొరేటర్లంతా కాంగ్రెస్ గూటికి వెళ్లే అవకాశం ఉంది..

స్వలాభం కోసమే..మేకల కావ్య

తనపై అకారణంగా అవిశ్వాసం పెట్టారని, అసమ్మతి వర్గంలోని కొంతమంది తమ స్వలాభం కోసం ఈ పని చేశారని మేయర్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకురాలు, మేయర్ మేకల కావ్య ఆవేదన వ్యక్తం చేశారు. అసమ్మతి వర్గంలో భూకబ్జాదారులు ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు శాంతి కోటేష్ గౌడ్, బల్లి రోజా, లలిత ల ఓటు హక్కు చెల్లుతుందా.. ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవిలకు ఓటు హక్కు కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అనంతరం ఆమె కలెక్టర్ గౌతమ్ కు పై విషయాలపై ఫిర్యాదుచేసి,చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యం గెలిచింది: మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ప్రజల మన్నలను పొందినప్పుడే ఎవరైనా పదవులలో కొనసాగుతారని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ కావ్యపై నమ్మకం లేదని 20 మంది కార్పొరేటర్లు బయటకు వచ్చేస్తే వారిపై గుండాయిజం చేసి తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించడం మేయర్ కు తగదని అన్నారు. మేయర్ పై అవిశ్వాసం ప్రకటించి చివరి వరకు నిలబడిన కార్పొరేటర్లు ఎటువంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని గెలిచే విధంగా చేశారని అన్నారు.


Similar News