కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు

దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్నే బలపరుస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Update: 2024-05-09 15:37 GMT

దిశ, మల్కాజిగిరి : దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్నే బలపరుస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం యాప్రాల్ లో నిర్వహించిన పద్మశాలి సమ్మేళనంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి పోయినా మళ్లీ ప్రధాని మోదీయే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తనను ఎంపీగా గెలిపిస్తామని మాట ఇస్తున్నారన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికి ఓటు వేసినా పార్లమెంటు ఎన్నికలలో మాత్రం బీజేపీ పార్టీవైపే మెగ్గు చూపుతున్నారన్నారు. సాధారణంగా ఐదేళ్లు పదవిలో ఉన్న నాయకునిపై కొందరు ప్రజలలో అయినా ఏదో ఒక వ్యతిరేకత వస్తుందని, ఐదేళ్ల అనంతరం నా పనితనం చూసి ఓట్లు వేయండని, మీ రిపోర్టు ఇవ్వండి అని అడిగితే 2014లో 275 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 303 సీట్లు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారన్నారు. పదేళ్ల

    తర్వాత మరింత ఉత్సాహంతో 370 సీట్ల పైన బీజేపీని గెలిపిస్తామని ప్రకటిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు చేయలేని హామీలు ఇచ్చింది అన్నారు. ప్రమాణ స్వీకారం చేయగానే పెన్షన్లు ప్రతినెలా 1వ తేదీన పడతాయని మహిళలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా అమలు కాలేదన్నారు. ప్రతీ మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్ , వికలాంగులకు రూ. 6వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షలు రుణం ఇస్తామని, కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామని మాయమాటలు చెప్పి వాటిలో ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా ఓట్లెస్తారని, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ హామీలు నెరవేర్చడం అసాధ్యమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసినా అవి వ్యర్ధమేనన్నారు. నియోజక వర్గంలో ఏసమస్య వచ్చినా దానిని

    నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగే సత్తా తనకే ఉందన్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా, వైద్యారోగ్య మంత్రిగా తెలంగాణ ప్రజలకు ఎలా సేవ చేశానో ప్రజలకు తెలుసని, హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం పెట్టేలా జీవో ఇచ్చింది, ఇక్కడ ఉన్న 78 కులాలకు ఎకరం, రెండెకరాల జాగా ఇచ్చి, హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి తాను కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా కాలంలో స్వయంగా పేషంట్లను పరామర్శించి వారికి సరైన ట్రీట్‌మెంట్లు ఇప్పించానన్నారు. మల్కాజ్ గిరికి రోడ్లు కావాలన్నా, తాగునీరు, డ్రైనేజీ సిస్టం, ఇండస్ట్రియల్ కారిడార్, రప్పించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. దేశంలో మోదీ వలన ప్రజలందరూ సురక్షితంగా బాంబుల మోతల భయం లేకుండా జీవిస్తున్నారని తెలిపారు. అనేక దశాబ్దాలుగా ఉన్న అయోధ్యరామమందిర సమస్యను పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని బలపర్చాలని అభ్యర్థించారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News