మ్యాన్ హోల్స్ రిపేర్ చేయకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులు

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ,మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ అవగాహన రాహిత్యంతో

Update: 2024-05-24 12:37 GMT

దిశ,దుండిగల్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ,మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ అవగాహన రాహిత్యంతో దుండిగల్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి.నూతన మున్సిపల్ చట్టం 2018 ప్రకారం సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలంటే మొదట పాడైన మ్యాన్ హొల్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అనంతరం మూడు లేయర్స్ తో కూడిన కంకర,డస్ట్ ఫీల్ చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్న నిబంధన స్పష్టంగా ఉన్నా నిబంధనలను తుంగలో తొక్కుతూ నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దుండిగల్ పురపాలక పరిధిలో దుండిగల్ తండా టూ లో జగదాంబ టెంపుల్ నుంచి ఎల్లమ్మ టెంపుల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు 23 లక్షల వ్యయంతో చేపట్టారు.

ఇంతవరకు బాగానే ఉంది.కాంట్రాక్టర్ కక్కుర్తి పడి మ్యాన్ హోల్స్ సరిచేయకుండా సీసీ రోడ్డు నిర్మాణం పనులు హడావుడిగా కొనసాగిస్తున్నాడు.మూడు మట్టి ఇటుకలు అమర్చి దాని మీద మ్యాన్ హోల్స్ పైకప్పు ఏర్పాటుచేసి సీసీ రోడ్డు నిర్మిస్తుండడంతో ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ కుంగిపోతున్నాయి.మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం,స్థానిక ప్రజా ప్రతినిధి ఉదాసీన వైఖరి తో అభివృద్ధి పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News