రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాలి

రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-04-28 16:14 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్డు షో లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రశ్నించే గొంతుకగా 2019 ఎన్నికల్లో తనని గెలిపించడంతో ఏఐసీ దృష్టిలో పార్టీ పట్ల నమ్మకంగా పనిచేస్తాను అనే నమ్మకంతో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని ఆ హోదాలో రాష్ట్రం నలుమూలల తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానాన్ని నిలబడ్డానని గుర్తు చేశారు. ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. మూసీ నది పరీవాహక ప్రాంత వాసుల సమస్యలు, మెట్రో సమస్యలు, 118 జీవోతో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉన్నదని, కానీ దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికలలో

     మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయారని అన్నారు. ఈనాడు సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చే శాసనసభ్యులు లేడని అన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఓవైసీ హాస్పిటల్ చాంద్రాయణగుట్ట మీదుగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు, అదేవిధంగా హయత్ నగర్ వరకు మెట్రో విస్తరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీని లేకుండే చేసే బాధ్యత యువకులపై ఉన్నదని పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఉన్న 11 డివిజన్లలో అన్నింటిలో బీజేపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారని, ఆ కార్పొరేటర్లు ఎన్నడైనా నీ సమస్యలు ఏంటి అని వచ్చారా..? అన్నారు.

     ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు పరిశ్రమ ఇస్తే ఇప్పటివరకు దాన్ని నిర్మించలేదని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సైతం రానివ్వలేదని, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఐటీఐ ఆర్ కారిడార్ లో రద్దు చేశారని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాను సైతం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 400 సీట్లు వస్తే బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నారని తెలిపారు. నాడు ప్రముఖులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారని, వాటిని బీజేపీ రద్దు చేస్తామంటున్నారని తెలిపారు. ఓటర్లు ఈ విషయం ఆలోచించాలని సూచించారు. మెట్రో ఎందుకు ఇవ్వలేదు అని అంటే జైశ్రీరామ్ అని అంటారు.. బయ్యారం ఉక్కు కర్మాగారం

    ఎందుకు ఇవ్వలేదు అని అంటే హనుమాన్ జయంతి చేశామని అంటారు.. బీజేపీ పుట్టక ముందు నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు నుంచే మా తాతలు వారి ముత్తాతలు అందరూ శ్రీరామనవమి, బోనాల పండుగ, హనుమాన్ జయంతి చేశారన్నారు. మైసమ్మకు, ఎల్లమ్మకు, పోచమ్మకు కోడి కోశామని, కల్లు పోశామన్నారు. బీజేపీ కూడా శ్రీరాముని చూపించే ఓట్లు అడుక్కుంటుందని… దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడి పేరిట ఓట్లు అడుక్కోవడం తగదని సూచించారు.

కారు ఖర్ఖానాకు పోయింది…

పది సంవత్సరాలు కేసీఆర్ మోసం చేసినందుకు ప్రజలు బండకేసి కొట్టారని, ప్రస్తుతం బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, దాని పయ్యలు ఎప్పుడో జుమ్మెరాత్ బజార్ లో అమ్మేశారని చలోక్తులు విసిరారు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కెడికి దిగినికి సరిపోయిందంటూ కేసీఆర్ బస్సు యాత్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవాచేశారు. ఆయన బస్సు దిగడానికి నలుగురు.. ఆరుగురు పట్టుకొని ఎక్కించాల్సి వస్తుందని, 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా చేసి సచివాలయంకు రాలేదని తెలిపారు. ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి కొంగ జపం చేస్తూ ప్రజల మధ్యకు వస్తున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. 

Similar News